Meenakshi-Natarajan
Politics

Meenakshi Natarajan: ‘వన్ మాన్-వన్ పోస్ట్’… ఎమ్మెల్సీ ఎంపికలో.. మీనాక్షి మార్క్

ఆచితూచి ఎంపిక చేసిన కొత్త ఇన్‌చార్జ్
పనిచేయని పెద్దల పైరవీలు, ఒత్తిడులు
పార్టీకి లాయల్‌గా ఉన్నోళ్ళకే అవకాశం
పీసీసీ చీఫ్ ఢిల్లీకి వెళ్లకుండానే ఫైనల్
టెలీ కాన్ఫరెన్స్‌లోనే వివరాల సేకరణ
అనూహ్యంగా తెర మీదకు విజయశాంతి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఎమ్మెల్సీ అభ్యర్థుల(MLC Candidates) ఎంపికలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌(AICC In charge)గా ఇటీవల నియమితులైన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) మార్క్ కనిపించింది. ధనబలం, పలుకుబడి, పైరవీలు(Lobbying), సీనియర్ల ఒత్తిడి, ఇలాంటివేవీ లేని నేతలే ఖరారయ్యారు. పార్టీకి లాయల్‌(Loyal)గా ఉంటే పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముగ్గురు అభ్యర్థుల ఎంపికతో స్పష్టమైందనే మెసేజ్ పార్టీ క్యాడర్‌(Party Cadre)లోకి వెళ్ళింది. పీసీసీ నుంచి ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనారిటీ(Minority), ఓసీ(OC) కేటగిరీలతో ఒక్కో సీటుకు పలువురి పేర్లతో కూడిన జాబితా ఏఐసీసీ(AICC)కి వెళ్ళింది. కచ్చితంగా టికెట్ వస్తుందనుకునే కొందరి పేర్లు గల్లంతయ్యాయి. పార్టీకి విధేయులుగా ఉన్నందుకే ఈ ముగ్గురినీ ఏఐసీసీ ఎంపిక చేసిందనే చర్చ మొదలైంది. అద్దంకి దయాకర్(Addanki Dayakar) మినహా మిగిలిన ఇద్దరికీ ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని పార్టీ నేతల్లోనే చాలామంది ఊహించలేకపోయారు. పీసీసీ(T-PCC) నుంచి కూడా వీరిద్దరి పేర్లు చివరి నిమిషాల్లోనే వెళ్ళినట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ అవకాశం కోసం పలువురు ప్రయత్నాలు చేసినా లోతుగా ఆలోచించిన మీనాక్షి నటరాజన్.. వన్ మాన్ – వన్ పోస్ట్ పాలసీ(One Man- One Post Policy)కి అనుగుణంగా ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారికి మరో అవకాశం ఇవ్వొద్దనే తీరులో వ్యవహరించి అలాంటివాటికి దూరంగా ఉన్నవారినే ఎంపిక చేశారు.

కవితకు కౌంటర్ ఇచ్చేందుకే రాములమ్మ!
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచే ఇద్దరికి అవకాశం ఇవ్వడం వెనక ఏఐసీసీ వ్యూహం పార్టీ రాష్ట్ర నేతలకు అంతుబట్టలేదు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) బలహీనంగా ఉన్న నల్లగొండ జిల్లా నుంచి మండలికి ఇద్దరికి అవకాశం ఇవ్వడంపై చర్చలు మొదలయ్యాయి. కౌన్సిల్‌లో బీఆర్ఎస్‌ను కార్నర్ చేయడానికి, కేసీఆర్ కుమార్తెగా కవితకు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి(Vijayshanthi)ని ఏఐసీసీ ఎంపిక చేసి ఉండొచ్చన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. తెలంగాణ వాదాన్ని, బీసీ నినాదాన్ని కవిత లేవనెత్తితే విజయశాంతి ద్వారా దీటుగా జవాబు చెప్పేలా ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆమెను కౌన్సిల్‌కు పంపుతున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. దీర్ఘకాలం పాటు బీఆర్ఎస్‌లో పనిచేయడం, కేసీఆర్‌(KCR)తో పాటు లోక్‌సభలో ఎంపీగా కలిసి పనిచేసిన విజయశాంతిని కౌన్సిల్‌కు పంపాలనే ఏఐసీసీ నిర్ణయం పక్కా వ్యూహాత్మకం అనే మాటలు వినిపిస్తున్నాయి.

విధేయతకు పట్టం కట్టిన మీనాక్షి
జాబితాలో ఉన్న పలువురు సీనియర్లను కాదని ఈ ముగ్గురినీ ఎంపిక చేయడంలో ఇన్‌చార్జ్‌గా మీనాక్షి తనవంతు పాత్రను పోషించారు. గతంలో టికెట్ కోసం సీనియర్ల ద్వారా పైరవీలు చేసుకోవాల్సి వచ్చేదని, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అలాంటివేమీ లేకుండా అంతా ఏఐసీసీ నేతలే నడిపించారని, చివరకు పీసీసీ చీఫ్, సీఎం, డిప్యూటీ సీఎం.. ఇలాంటి సీనియర్ నేతలను కూడా ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదంటూ సమాచారం ఇచ్చి ఫోన్‌లోనే సంప్రదింపులు జరిపి అభ్యర్థులను ఖరారు చేశారన్న వ్యాఖ్యాలు గాంధీభవన్‌లో వినిపించాయి. గతంలో పైరవీలు చేసుకునే వాతావరణం ఉన్నా మీనాక్షి నటరాజన్ ఇన్‌చార్జ్‌గా వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి వారి ‘గాడ్ ఫాదర్’ లాంటి సీనియర్లతో లాబీయింగ్ చేసే సాహసానికి దిగలేదని, అందువల్లనే ఫైనల్ లిస్టు వచ్చేంత వరకు ఉత్కంఠగా ఎదురుచూశారన్న మాటలూ వ్యక్తమయ్యాయి.

ప్రయత్నం చేయని వారికి చాన్స్
గతంలో టికెట్లను ఆశించినా పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశకు లోనయ్యారు. కానీ సొంత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, మరో పార్టీలోకి మారకుండా, కాంగ్రెస్‌తోనే కొనసాగారని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారని, ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయకున్నా వారికి చాన్స్ వచ్చిందనేది పలువురు నేతల వాదన. విజయశాంతి ఏఐసీసీ కోటా కింద ఎంపికయ్యారని, అద్దంకి దయాకర్ పేరు పీసీసీ ద్వారానే వెళ్ళిందని, శంకర్‌నాయక్ పార్టీకి విధేయుడిగా ఉన్నందున చాన్స్ వచ్చిందని.. ఇలాంటి అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ కూడా జాబితాలోని వ్యక్తులే ఖరారయ్యేలా ఏఐసీసీని కన్విన్స్ చేసే పరిస్థితికి తావులేకుండా మీనాక్షి నటరాజన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తొలుత ఢిల్లీలో ముఖాముఖి మాట్లాడుకుని అభ్యర్థులన ఖరారు చేయాలన్న ఆలోచన ఉన్నా చివరకు టెలిఫోన్ ద్వారానే పని కానిచ్చేశారు.

రాములమ్మ విషయంలో ఏఐసీసీ ముందుచూపు
విజయశాంతి ఎంపిక విషయంలో ఏఐసీసీ ముందుచూపుతో వ్యవహరించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించిన విజయశాంతి ఇప్పటికీ ఆయన గురించి ఘాటుగా, ముక్కుసూటిగానే తప్పుపడుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన ఆమె బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీల్లో విజయశాంతి ఒకరు (మరొకరు కేసీఆర్). బీజేపీని సైతం విధానపరంగా, సైద్ధాంతికంగా తూర్పారబట్టడంలో ముందూ వెనకా చూసేవారు కాదనే ముద్ర ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆమె ఎలాంటి పదవులు, అవకాశాల కోసం ప్రయత్నించలేదని, గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీచేయడానికి సైతం పార్టీ ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారని పార్టీ నేతలు గుర్తుచేశారు.

ముగ్గురి ఎంపికలో సోషల్ జస్టిస్ పాలసీ
ఇక శంకర్ నాయక్ ఎంపిక విషయంలో ఎస్టీల (లంబాడా) ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకున్నారని, కేవలం మిర్యాలగూడకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లోని సామాజికవర్గాన్ని సైతం ప్రభావితం చేయగలుగుతారని, అందువల్లనే ఏఐసీసీ ఎంపిక చేసి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పదేండ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నా పార్టీతోనే కొనసాగారని, కార్యకర్తలను చేజారకుండా చూసుకున్నారని, చివరకు ఆయనను పార్టీ ఈ రూపంలో గౌరవించిందన్న మాటలు జిల్లా నేతల నుంచి వినిపించాయి. అద్దంకి దయాకర్ సైతం ఎమ్మెల్యేగా, ఎంపీగా టికెట్‌ను ఆశించినా పార్టీ నిరాకరించడంతో సైలెంట్‌గా ఉండిపోయారు తప్ప అసంతృప్తిని, అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదని, పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్నారని గాంధీభవన్‌లో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్లకు అడ్డా.. అనే ముద్రను తొలగించడంలో, రాహుల్‌గాంధీ వల్లెవేస్తున్న సోషల్ జస్టిస్ పాలసీ ముగ్గురు అభ్యర్థుల ఎంపికలో స్పష్టంగా కనిపించిందనే మాటలు వినిపిస్తున్నాయి. రెడ్లకు, అగ్రవర్ణాలకు చోటు ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళ కోటా.. ప్రకారం ముగ్గురిని ఎంపిక చేసి ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేని తీరులో ఏఐసీసీ ద్వారా మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో వ్యవహరించారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..