Tahawwur Rana: అమెరికాలో బందీగా ఉన్న 26/11 ముంబయి దాడుల సూత్రధారి తహవూర్ రాణా (26/11 Accused Tahawwur Rana)కు అక్కడి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. భారత్ కు పంపొద్దంటూ తహవూర్ చేసిన విజ్ఞప్తిని యూఎస్ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత్ కు పంపాలా? వద్దా? అన్న అంశంపై తాము ఎలాంటి తీర్పు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో తహవూర్ ను భారత్ అప్పగిస్తామన్న ట్రంప్ నిర్ణయంపై ఎలాంటి స్టే ఇవ్వడం కుదరదని ముంబయి దాడుల ఉగ్రవాదికి స్పష్టం చేసింది.
అప్పగింతకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
ముంబయి ఉగ్రదాడిలో దోషిగా తేలిన తహవూర్ రాణా.. ప్రస్తుతం లాస్ ఎంజెల్స్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడ్ని తమ దేశానికి అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. ఈ క్రమంలో ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ (PM Modi).. తహవూర్ అప్పగింతపై ట్రంప్ తో చర్చించారు. దీంతో ఇరుదేశాధినేతల మీడియా సమావేశంలో ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. తహవూర్ రాణాను (Tahawwur Rana)భారత్ కు అప్పగించనున్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దానిపై స్టే విధించాలని తహవూర్ రాణా యూఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కోర్టును ప్రాధేయపడ్డ తహవూర్
అమెరికా సుప్రీంకోర్టు (USA Supreme Court)లో విచారణ సందర్భంగా తహవూర్ రాణా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పాకిస్థానీ ముస్లిం కాబట్టి భారత్ లో తనను హింసిస్తారని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న తనను భారత్ కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని కోర్టుకు విన్నవించుకున్నాడు. తన అప్పగింత అమెరికా చట్టాలతో పాటు ఐరాస తీర్పులకు ఉల్లంఘించడమేనని పేర్కొన్నాడు. పైగా భారత్ లోని మోడీ ప్రభుత్వం ముస్లింల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోందంటూ గతంలో వచ్చిన అంతర్జాతీయ రిపోర్టును సైతం కోర్టుకు చూపించారు. తహవూర్ రాణా తరపు న్యాయవాది ఎంతగా వాదించినా పట్టించుకోని యూఎస్ సుప్రీం కోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Also Read: Gadchiroli: దండకారణ్యంలో నక్సల్స్ కనుమరుగు- మావోయిస్టు రహిత జిల్లాగా గడ్చిరోలి
భారత్ కు రావాల్సిందే
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. ముంబయి దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు భారత నిఘా వ్యవస్థ గుర్తించింది. ముంబయిలో ఉగ్రవాద దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలోనూ రాణా హస్తం ఉన్నట్లు తేలింది. దీంతో రాణా, హెడ్లీపై ఉగ్ర దాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్న క్రమంలో అమెరికాలో 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడ్ని తమకు అప్పగించాలంటూ భారత్ కొంతకాలంగా పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా అత్యున్నత న్యాయస్థానం సైతం అతడి పిటిషన్ ను కొట్టివేయడంతో అతడు భారత్ కు రాక తప్పదు.