Amazon layoffs 2025: ప్రముఖ వ్యాపార దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకూ పలుమార్లు కింది స్థాయి ఉద్యోగులను తొలగిస్తూ వచ్చిన అమెజాన్.. ఈసారి సీనియర్ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో యాండీ జెస్సీ (Andy Jassy) స్వయంగా వెల్లడించారు. టీమ్ లీడర్లు, మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వారిని తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
నిర్ణయాల్లో జాప్యం వల్లే
ఆర్థిక మాంద్యం, ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశ్యంతో దిగ్గజ వ్యాపార సంస్థ అమెజాన్ గతంలో పలుమార్లు ఉద్యోగులపై వేటు వేసింది. ఈ క్రమంలో తాజాగా బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆ సంస్థ సీఈవో యాండీ జెస్సీ.. మరోమారు అమెజాన్(Amazon)లో లేఆఫ్(Layoffs)ల పర్వం మెుదలుకానున్నట్లు సూచన ప్రాయంగా తెలియజేశారు. ఉద్యోగులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేందుకు టీమ్ లీడర్లు/ మేనేజర్ల ప్రమేయాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారి ప్రమేయాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు. ఈ మార్పులు అమెజాన్ ను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.
అనవసరమైన సమావేశాలు
కంపెనీ వ్యవహారాల్లో పలు దశల్లో మేనేజర్లు ఉండటం వల్ల అనవసరమైన సమావేశాలు ఎక్కువ అవుతున్నట్లు జెస్సీ తెలిపారు. దీని వల్ల పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నష్టాన్ని నివారించి ఉద్యోగులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అవసరానికి మించి ఉన్న టీమ్ లీడర్లు/ మేనేజర్ల తొలగింపు ప్రక్రియ మెుదలవుతుందని పరోక్షంగా అమెజాన్ సీఈవో తెలియజేశారు.
Also Read: Trump Warns Hamas: ‘హలోనా? గుడ్‌బైనా?.. ఒక్కడూ మిగలడు’.. ట్రంప్ బిగ్ వార్నింగ్
సంస్కరణలకు పెద్దపీట
అమెజాన్ సీఈవోగా యాండీ జెస్సీ (Andy Jassy) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థలో ఎన్నో విఫ్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అమెజాన్ లో సమూల మార్పులు తీసుకొచ్చారు. కరోనా టైమ్ లో విధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ఆయన వచ్చిరాగానే చెక్ పెట్టారు. తొలుత వారంలో 3 రోజులు ఆఫీసులో పనిచేయడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కంపెనీ అభివృద్ధికి ఐదు రోజులు కార్యాలయానికి రావడం అవసరమని చెబుతూ ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు.