అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Zelenskyy) మధ్య శ్వేతసౌధం వేదికగా జరిగిన మాటల యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ షరతులకు అంగీకరించకుంటే రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ సాయం చేయబోమని ట్రంప్ తెగేసి చెప్పారు. దీంతో ఆ మార్నాడే యూకే ఫ్లైట్ ఎక్కిన జెలెన్ స్కీకి బ్రిటన్ భారీ ఊరట కలిగించింది. అమెరికా లేకపోతేనేం మేమున్నామంటూ ఆర్థిక భరోసాను కల్పించింది. యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ కు భారీ రుణసాయాన్ని ప్రకటించింది.
3.1 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటి అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నేరుగా బ్రిటన్ వెళ్లారు. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer)తో ఆయన ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన బ్రిటన్ ప్రధాని.. 3.1 బిలియన్ డాలర్ల విలువైన రుణ ఒప్పందంపై సంతకం చేశారు. గత కొన్నేళ్లుగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది. బైడెన్ హయాంలో అండగా నిలిచిన అమెరికా.. ట్రంప్ అధికారం చేపట్టేసరికి చేతులెత్తయడంతో జెలెన్ స్కీ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ క్రమంలో యూకే ఆర్థిక సాయం ప్రకటించడం ఉక్రెయిన్ కు భారీ ఊరటేనని చెప్పవచ్చు.
Also Read: Himani Narwal: సూట్ కేస్ లో మహిళా కాంగ్రెస్ కార్యకర్త బాడీ.. అసలేం జరిగిందంటే?
ఇరుదేశాధినేతలు ఏం చర్చించారంటే
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో భేటి అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియాతో మాట్లాడారు. యూకే అందించిన 3.1 బిలియన్ డాలర్ల రుణ సాయాన్ని ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. రష్యాతో యుద్ధం ముగించే అంశంపైనా తాము భేటిలో చర్చించినట్లు తెలిపారు. కష్టకాలంలో బ్రిటన్ లాంటి వ్యూహాత్మక భాగస్వామి దొరకడం తమ అదృష్టమని జెలెన్ స్కీ అన్నారు. కాగా ఈ పర్యటనలో బ్రిటన్ రాజు ఛార్లెస్ తోనూ జెలెన్ స్కీ సమావేశమయ్యే అవకాశముంది.
ట్రంప్ ను బ్రిటన్ రెచ్చగొట్టిందా?
రష్యాతో యుద్ధంలో తొలి నుంచి ఉక్రెయిన్ పక్షాన నిలిచిన అమెరికా.. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నుంచి యూటర్న్ తీసుకుంది. రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి తెచ్చింది. అదే సమయంలో ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జెలెన్ స్కీతో నిర్వహించిన భేటి విఫలమైంది. దీంతో ఉక్రెయిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపంగా ఉన్నారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్ కు భారీ రుణసాయాన్ని బ్రిటన్ ప్రకటించడంపై ప్రపంచ దేశాల్లో చర్చకు దారితీశాయి. రష్యాతో యుద్ధంలో అమెరికా వెనక్కి తగ్గినా ఈయూ మాత్రం అండగా ఉంటుందన్న సందేశాన్ని ఈ చర్యతో బ్రిటన్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. మరి దీనిపై ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.