Tuesday, July 23, 2024

Exclusive

Telangana: ఏమి మారింది మన తెలంగాణ..?

What Has Changed Our Telangana: తెలుగు నేల మీద జరిగిన సుదీర్ఘమైన రాజకీయ, సాంస్కృతిక పోరాటాల్లో తెలంగాణ ఉద్యమాన్ని మించినది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కనిపించిన, కనిపించని అనేక రకమైన నిర్బంధాలను ఈ ఉద్యమం ఎదుర్కొన్నది. పలు రాజకీయ పంథాల్లో ఉన్నవారితో బాటు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమం ‘నాది’ అనుకున్నారు. ఉద్యమం ప్రారంభం నుంచి పలు రూపాలు తీసుకున్నప్పటికీ, 2009 నాటికి ‘జై తెలంగాణ’ అనే మాట మూడున్నర కోట్లమంది ప్రబల ఆకాంక్షగా మారిపోయింది. కవుల కలాలు, గాయకుల గళాలు ఈ ఉద్యమానికి ఊపిరులూదగా తెలంగాణలోని ప్రతి పౌరుడూ.. కదన రంగపు సైనికుడయ్యాడు. వలస ధోరణులున్న పాలకుల దోపిడి, దశాబ్దాల తరబడి పెత్తనం చేసిన సాంస్కృతిక అభిజాత్యం, నీళ్ళు నిధులు నియామకాలలో దగాను ధైర్యంగా, సాక్షాలతో సహా ప్రపంచం ముందు చర్చకు పెట్టిన తెలంగాణ సమాజం.. ఆ అన్యాయాలకు ఎదురొడ్డి నిలబడింది. తరాల తరబడి అణచివేతను, పీడనను, దోపిడిని పంటిబిగువన భరించిన ఇక్కడి ప్రజలు.. ‘ఇక మా పాలన మాగ్గావాలె’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. తమ ప్రాంత విముక్తికోసం వందలాది మంది ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఇలా సాధారణ ప్రజలు.. ఆత్మత్యాగాలకు పాల్పడటం భారత దేశ చరిత్రలో ఎక్కడా కానరాదు. కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్ధులు, శ్రామికులు, రైతులు, ఉద్యోగులు.. ఇలా సకల జనులూ ఒక్కమాటపై నిలబడిన తర్వాతే.. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ కల సాకారమైంది. మరి ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ ప్రయాణం ఎలా సాగింది? నేడు మన తెలంగాణ ఎక్కడ నిలబడింది? రేపటి గురించి మన తెలంగాణ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను ఈ పదవ రాష్ట్ర అవతరణ వేడుకల వేళ ఒకసారి విచారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ ఉద్యమానికి ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ వంటి బలమైన నినాదాలను అందించిన పాత్రికేయులు ఉద్యమానికి మార్గదిర్దేశకులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయేందుకు యాజమాన్యాల మాటలకు ఔనన్నట్లుగా తలూపుతూనే, తెలంగాణ కోసం కలంకూలీలుగా మారారు. తాము అనుకున్న, నమ్మిన భావాలను ప్రజల్లో చర్చకు నిలిపారు. రాజకీయ ఆలోచన లేని కారణంగానే 1969 ఉద్యమం నిరుపయోగమైపోయిందని భావించి, అధికారం కోసం కాచుకు కూర్చున్న ఓ నేతపై అమితవిశ్వాసంతో అతనికి అధికారాన్ని అప్పగించారు. అతడిని తెలంగాణ బాహుబలిని చేశారు. తమకు ఎన్ని అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగి తమ అందరిబలాన్ని ఒకే వ్యక్తికి ధారపోసారు. తమ మస్తిష్కాలను మథించి కార్యాచరణను ఆయన చేతిలో పెట్టారు. అందరిలో ఒకడిని.. ఒకేఒక్కడిగా తీర్చిదిద్దారు. తెలంగాణ యాస మరెవ్వరి నోటా అంత అందంగా పలకదని నమ్మబలికారు. ఇంత చేసిన జర్నలిస్టులకు తెలంగాణ వచ్చిన దక్కిన గౌరవమేమిటో అందరికీ బాగా అనుభవంలోకి వచ్చింది.

పదేళ్ల నాడు సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో పాలకుల అడుగులు ఆదిలోనే తడబడ్డాయి. కాలక్రమంలో పాలకుడి విధానాల్లో, ఆలోచనల్లో, చివరికి పాత్రికేయులతో మాట్లాడే మట్లాడే మాటల్లోనూ ప్రజాస్వామిక భావనలు లేకుండా పోయాయి. అప్పటివరకు సీమాంధ్ర దోపిడీదారులని తిట్టిపోసిన నేతలు.. వారినే ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి, ‘పెట్టుబడులు పెట్టేవారు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం?’ అనే ఎదురు ప్రశ్నే ఎదురైంది. ఏడు మండలాలను అడిగిన వారు ఊహించిన దాని కంటే వేగంగా ధారదత్తం చేశారు. అంతేకాదు.. సీమాంధ్ర దోపిడీ దారుల స్థానంలో ఒక నయా ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గాన్ని నాటి పాలకులు సృష్టించుకున్నారు. తద్వారా తెలంగాణ వనరులను పరోక్షంగా తమ గుప్పిట పట్టి, పదేళ్ల కాలంలో ఆర్థికంగా ఎదిగిపోయారు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోపిడీ నిరాటంకంగా జరిగిపోయింది. ఇదే సమయంలో పోరాడిన ఉద్యమకారులు వీధిన పడ్డారు. ఫక్తు ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న వారే దానిని ప్రజాస్వామ్యం పొడగిట్టని, భిన్నాభిప్రాయాన్ని సహించలేని పార్టీగా మార్చేశారు. ఈన గాచి నక్కల పాలు చేసినట్లుగా రాజ్యపాలన సాగింది. ఈ పరిణామాలు తెలంగాణకోసం బరిగీసి పోరాడిన విద్యార్ధి లోకాన్ని, ఉద్యమ కారులను కలతపరిచాయి. రైతు ఆత్మహత్యలు ఆగలేదు. పట్టింపులేని పాలకుడి హయాంలో పరీక్ష పత్రాలు అంగడి సరుకుగా మారి నిరుద్యోగులకు రేపటి పట్ల నమ్మకం పోయింది. ప్రజల ధనంలో నిర్మించిన ప్రజాభవన్‌కు రెండు కి.మీ దూరం నుంచే ఇనుప కంచెలు నిర్మించి, నిరసన గళాలు చెవిలో పడకుండా చూసుకోవటంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో జనం పడిపోయారు. ప్రజాభవన్ 17 అడుగుల ప్రహరీ గోడలు.. ఆనాటి దొరల గడీలకు ఆధునిక నమూనాగా నిలిచాయి.

Also Read: రాజముద్ర మార్పుపై గులాబీ రాజకీయం..!

ఇక.. తెలంగాణ పురుడు పోసుకున్న తొలినాళ్లలోనే ప్రజా, పౌర హక్కులు హరించుకుపోయాయి. చివరికి ‘న్యాయం చేయండి బాబూ..’ అని కోరే ధర్నా చౌక్‌ని కూడా తరలించారు. ఇదేం అన్యాయమన్న వారికి ‘బంగారు తెలంగాణలో ఇంకా.. ఉద్యమాలు అవసరం లేదు’ అంటూ అంతర్లీనంగా ఒక హెచ్చరికతో కూడిన జవాబు వచ్చింది. ఉద్యమంతో సంబంధం లేని వందిమాగధుల గణం ఒకటి పాలకుల చుట్టూ చేరగా, తెలంగాణ ఉద్యమకారులను లాఠీలతో కొట్టించిన నేతలు మంత్రివర్గంలో మూడవవంతుగా అత్యంత సౌకర్యవంతంగా స్థిరపడిపోయారు. పాలకుడి సొంత ఆలోచనల మేరకు జలయజ్ఞం నిరాటంకంగా జరిగిపోయింది. ప్రాజెక్టుల పేరుతో కొంపాగోడూ కోల్పోయిన వారికి పునరావాసమనేది మాటలకే పరిమితమవటంతో వారంతా గూడు కోల్పోయిన పక్షులయ్యారు. రంగనాయకసాగర్, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం రైతుల భూములు లాక్కున్న తీరు మాటల్లో వర్ణించలేని అన్యాయంగా మిగిలిపోయింది. దళిత ముఖ్యమంత్రి హామీకి బదులుగా 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సరిపెట్టేశారు. ఆ ఎత్తైన మూర్తుల స్థాయిలోనే బడుగుజీవుల జీవన ప్రమాణాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. దళితులకు మూడెకరాల భూమి, ఉపఎన్నిక వేళ అస్త్రంగా ప్రయోగించబడి, పారని ‘దళిత బంధు’నూ నెరవేర్చలేకపోయారు. ధరణి పేరుతో ఎవరి భూమినైనా తమ ఆశ్రిత పెట్టుబడివర్గానికి బదిలీ చేయగల సామర్థ్యాన్ని పాలకపక్షం సమకూర్చుకుంది. గోదావరి నదీ జలాలను గరిష్టంగా వాడేందుకు కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించామని చెప్పుకున్నా, ఒక్క వరదతో అది కుదేలై నిరర్థక ఆస్తిగా మారింది. సాగునీటికి బదులు లక్షకోట్ల అవినీతి ఏరులై పారింది. మిషన్‌‌ కాకతీయ, మిషన్‌‌ భగీరథ లక్ష్యాలు గొప్పగా కనిపించినా, ఆచరణలో చౌకబారుతనం ఆ లక్ష్యాలను నీరుగార్చింది. బంగారు తెలంగాణ నిర్మాణానికి రాజకీయ ఏకీకరణ అనివార్యం అంటూ విపక్ష ప్రజాప్రతినిధులను ఆకర్షించిన తీరు ప్రజాస్వామిక వాదులకు ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో వచ్చిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తాము మార్పు కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

అధికారంలో వచ్చిన 48 గంటల్లో తొలినాళ్లలో కాంగ్రెస్ ఆయా రంగాల మీద నిపుణులు అభిప్రాయాలను కోరి, ఆ మేరకు శ్వేతపత్రాలను విడుదల చేసింది. అదే సమయంలో ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. అంటీముట్టనట్లుగా కేంద్రంతో దూరం పాటించిన గత పాలకులకు భిన్నంగా హస్తినతో సత్సంబంధాలకు నెలకొల్పుకునే దిశగా అడుగులు పడ్డాయి. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి, ఫలితాలు కూడా విడుదలై, నియమాక పత్రాలకై ఎదురుచూస్తున్న వారందరికీ స్వయంగా ముఖ్యమంత్రి అప్పాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. నిరుత్సాహంలో ఉన్న నిరుద్యోగులకు కొత్త ఉత్సాహాన్నిచ్చేలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే, హామీల అమలుతోనే దగాపడిన తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ న్యాయం జరుగుతుందనుకుంటే అది పొరపాటే కాగలదు. తెలంగాణ పునర్నిర్మాణానికి కాంగ్రెస పార్టీ ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రచించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ హితమైన ప్రగతి, సబ్బండ వర్ణాలకు న్యాయం జరిగే పారదర్శక విధానాలు, కునారిల్లిన ప్రజాస్వామిక విలువలకు కాంగ్రెస్ పార్టీ ప్రాణప్రతిష్ఠ చేయాల్సి ఉంది. ముఖ్యంగా, భావోద్వేగమైన అంశాలతో రాజ్యాధికారం సాధించాలనుకుంటున్న శక్తులను నియంత్రించమెలాగో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయిన ఈ కీలక సమయంలో తెలంగాణ ఏం కోరుతోంది? తెలంగాణకు ఏది అవసరం? అనే అంశాలను గమనించుకుంటూ పూర్తి సంయమనంతో పాలన చేయగలిగితే, దశాబ్దకాలపు నష్టాన్ని కాంగ్రెస్ భర్తీ చేయగలుగుతుంది. ఈ గుణాత్మకమైన మార్పు రాబోయే రోజుల్లో తెలంగాణలో వస్తుందని, రావాలని మనసారా ఆకాంక్షిద్దాం. జై తెలంగాణ.

-పి.వి. శ్రీనివాస్ ఎడిటర్ ఇన్ చీఫ్, బిగ్ టీవీ

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Plastic: ప్లాస్టిక్‌పై పోరాటం, నేటి అవసరం..

Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్‌ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...