Sangareddy District: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(భి) గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కొత్త ఫార్మా కంపెనీకి మంగళవారం పూజలు జరుగుతున్న విషయాన్నీ తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు కర్మాగారం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఫార్మా కంపెనీ వద్దంటూ నినాదాలు చేసారు. మూత పడ్డ పాత కర్మాగారాన్ని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసి ఫార్మాను రన్ చేసేందుకు దొడ్డి దారిన అనుమతులు పొందారని ఆరోపించారు.
కాలువలోకి వ్యర్ధ జలాలు
గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఫార్మాను ఎలా నడుపుతారని మండిపడ్డారు. కర్మాగారం ప్రహరి గోడ నుండి బుర్దిపాడ్ వెళ్లే దారిలోని వాగు వరకు తీసిన కాలువ ద్వారా వ్యర్ధ జలాలను వాగులోకి వదిలే ప్రయత్నం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దిడిగి, కొత్తూరు (భి), బుర్దిపాడ్, తుంకుంట, బుచనెల్లి గ్రామ వాసులు కర్మాగారం ముందు బైటాయించి నిరసన తెలిపారు. ఫార్మా(Phaama) వద్దంటూ యాజమాన్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ధర్నా నిర్వహించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీఐ శివలింగం(CI Shivalingam) గ్రామస్తులను సముదాయించి శాంతింపజేశారు.
Also Read; Endowments Department: ఏళ్లుగా దేవాదాయశాఖలో 410 పోస్టులు ఖాళీ.. భర్తీకి మోక్షం ఎప్పుడు?
పంచాయతీ అనుమతి తీసుకోకుండా..
కర్మాగార జీఎం లక్ష్మారెడ్డితో మాట్లాడించారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, కంపెనీతో ఎవరికి నష్టం ఉండదన్నారు. ఫార్మాతో పంటపొలాలు, నీరు, గాలి కాలుష్యం అవుతాయని సీపీఎం(CPM) నేత భి. రాంచందర్ మండిపడ్డారు. కంపెనీపై తిరుగుబాటు చేసి ప్రజల పక్షాన పోరాడుతామని కామ్రేడ్స్ సుకుమార్, రాంచందర్ పేర్కొన్నారు. పంచాయతీ అనుమతి తీసుకోలేదని, ఫార్మతో పక్కనే ఉన్న నారింజ ప్రాజెక్ట్ కు ప్రమాదమని కొత్తూర్ గ్రామ మాజీ సర్పంచ్ జగన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మరో దిగ్వల్ గా మార్చొద్దని, వెంటనే ఫార్మను మూసివేయాలని మాజీ ఎంపిటిసి హన్మంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి లు డిమాండ్ చేసారు. నాలుగు రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని, యాజమాన్యం నిర్ణయం మేరకు ఉద్యమానికి సిద్ధం అవుతామని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు స్పష్టం చేసారు.
Also Read: Telangana Intermediate Board: ఇక పై ఇంటర్ లో ఏఐ కోర్సు..