Nalgonda District: కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం, బఫర్ నిల్వ సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌లు పాల్గొన్నారు. కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ, ఆహార భద్రతలో భాగంగా దేశవ్యాప్తంగా 2.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని, దేశంలో 9.15 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని చెప్పారు.
ధాన్యం సేకరణను 600 శాతానికి పెంపు
తెలంగాణకు ప్రతినెల 1.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని కేటాయిస్తున్నామని, ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం కాగా, 3,370 గోధుమలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ధాన్య ఉత్పత్తి, సేకరణలో ముందు వరసలో ఉందన్నారు. 2014-15 నుంచి తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను 600 శాతానికి పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న గోడౌన్ 62 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉందని, ప్రభుత్వం భూమి కేటాయిస్తే మరో గోడౌన్ నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన రూ.343 కోట్ల సబ్సిడీతో పాటు 1400 కోట్ల సీఎంఆర్ బకాయిలు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Also Read:Nalgonda district: కాలుష్యం వెదజల్లుతున్న రైస్‌మిల్లులు.. పట్టించుకొని అధికారులు
సీఎంఆర్ గడువు పొడిగించండి
రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ముఖ్యంగా, 2024-25 ఏడాదికి సంబంధించి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా, రాష్ట్ర ప్రభుత్వం 8,800 కేంద్రాలను ఏర్పాటు చేసి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని, ఇందుకోసం సుమారు 29 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ గడువును 60 రోజులకు, యాసంగి సీజన్ సీఎంఆర్ గడువును 120 రోజులకు పెంచాలని అభ్యర్థించారు. బియ్యం రవాణా వేగంగా జరిగేందుకు రాష్ట్రానికి అదనపు ర్యాక్‌ల సదుపాయం కల్పించాలని, 2025-26 సంబంధించిన ధాన్యం సేకరణ టార్గెట్‌ను 80 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి పెంచాలని కోరారు.
బత్తాయి రైతులకు నిల్వ భద్రత కావాలి
నల్గొండ జిల్లాలో అత్యధికంగా 17,500 హెక్టార్లలో 4.5 లక్షల టన్నుల బత్తాయి సాగవుతున్నప్పటికీ, దీనికి ఇంకా జాతీయ స్థాయిలో గుర్తింపు, తగిన నిల్వ మౌలిక సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో, నల్గొండ బత్తాయికి ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు 2,500 మెట్రిక్ టన్నుల కోల్డ్-స్టోరేజ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సంక్షేమాన్ని పెంపొందించడానికి, అధునాతన సైలోలు, డ్రైయర్‌లతో కూడిన ఆధునిక వరి ధాన్యం గిడ్డంగి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ చర్యలన్నీ నల్గొండ జిల్లాలోని రైతుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేస్తాయని, వ్యవసాయ-ఉద్యానవన రంగాల అభివృద్ధిని వేగవంతం చేస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు.
Also Read: Suryapet District: సూర్యాపేట జిల్లాలో.. ఎస్సై వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య!

