Mana Ooru Mana tourism: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు వాటిని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ‘మన ఊరు.. మన టూరిజం’(Mana Ooru Mana tourism) కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.
ఖ్యాతిగాంచిన దేవాలయాలు, కోటలు(పోర్టులు), చెరువులు, ఫారెస్టు ట్రెక్కింగ్, గుట్టలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏవేవీ ఉన్నాయనేది మ్యాప్‌ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అయితే, మనఊరు-మనటూరిజం కార్యక్రమంతో విస్తృత ప్రచారం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నది. జిల్లాల్లో పర్యాటక సంపదను వెలికితీయడంతోపాటు అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశం. జిల్లాల్లోని చారిత్రక కట్టడాలు, ఆలయాలు, సహజ జలపాతాల తదితర పర్యాటక ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తున్నది.
Also Read: Ramchanadr Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం!
కళలు, చేతివృత్తుల వంటి వాటిని ప్రాత్సహించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను భాగస్వామ్యం చేసి వారికి అవగాహన కల్పించడం.. పర్యాటక స్థలాల పర్యవేక్షణ, పరిరక్షణలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. పర్యాటక స్థలాల సందర్శన, సౌకర్యాల అంచనా, స్థానికులతో చర్చించడం, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. పర్యాటక స్థలాల్లో పరిశుభ్రత, సంరక్షణ, ప్రచార కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టేలా ప్లాన్ రూపొందిస్తున్నది. అంతేగాకుండా, ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్‌లు ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమంతో యువతలో పర్యాటక అవగాహన పెంపొందించడంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు సర్కార్ కృషి
ప్రతి జిల్లాలోని పర్యాటక స్థలాలను గుర్తించడంతోపాటు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రోడ్లు, వసతి సౌకర్యాలు, గైడెడ్ టూర్స్, డిజిటల్ ప్రమోషన్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్ల ద్వారా ఈ పర్యాటక స్థలాలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో హోటళ్లు, రవాణా, చేతివృత్తులు, గైడ్ సేవలు వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతాయి. తద్వారా ఆయా ప్రాంతాలకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ‘మన ఊరు.. మన టూరిజం’ కార్యక్రమ తేదీలను త్వరలో ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
విద్యార్థులకు విహారయాత్రలు
ఇప్పటికే విద్యార్థులు విహారయాత్రతో విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి, అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. అందులో భాగంగానే విద్యార్థులను విహారయాత్రలకు కూడా తీసుకెళ్లే అవకాశం కల్పించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల నుంచి కళాశాల స్థాయి విద్యార్థులకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దర్శిని’కి శ్రీకారం చుట్టింది.
ఈ పథకం కింద రెండవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ప్రభుత్వం నిధులు సైతం కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏకో టూరిజం, కళలు, చేతివృత్తులు, సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం లభించింది. ఇప్పుడు టూరిజం శాఖ ‘మన ఊరు.. మన టూరిజం’ కార్యక్రమం సైతం చేపట్టబోతుండడంతో విద్యార్థులకు మరింతగా దోహదపడనుంది. పర్యాటకులను సైతం ఆకర్షించే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.