Parking Problems: గద్వాల జిల్లా కేంద్రంలో దుకాణాల సముదాయాలు, వ్యాపార కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాణిజ్య కేంద్రంగా గద్వాల దినదినాభివృద్ధి చెందుతుండడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేంద్రానికి వస్తుంటాయి. వాహనాలు నిలిపేందుకు సరైన స్థలాలు లేక రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. గద్వాలతో పాటు ఐజ, శాంతినగర్, అలంపూర్ కేంద్రాలలో సైతం రద్దీ ఉండే ప్రాంతాలల్లో తప్పనిసరిగా పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాల్సి ఉంది. కానీ ఎక్కడ వాటి ఊసే లేదు. ప్రధాన వ్యాపార కేంద్రాలైన గద్వాలలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, గాంధీ చౌక్ నుంచి కిష్టారెడ్డి బంగ్లా వరకు,తుల్జరాం గుడి,పాత కూరగాయల మార్కెట్ ఏరియా,లో ద్విచక్ర వాహనాలు,కార్లు ఇష్టం వచ్చినట్లు నిలుపుతున్నారు. దీంతో కార్లు,భారీ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతి పనికి రోడ్డు పైకి..
జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం గద్వాలలో వాహనాల రద్దీకి తగ్గట్లు పార్కింగ్ స్థలాలు లేవు. రోజు రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి. ప్రతి పనికి ప్రజలు వాహనంతో పాటు రోడ్లపైకి వస్తున్నారు. అధికారికంగా ఒక్క పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనదారులు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంతో పాటు షాపుల ముందు వాహనాలు నిల్పుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి రాంగ్ పార్కింగ్ పేరుతో జరిమానాలు విధించకోవడంతో అధికారికంగా పార్కింగ్ స్థలం లేని ప్రాంతంలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిల్పడంతో షాపులకు కస్టమర్లు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,దీంతో పది నుంచి 30 వేల వరకు షాప్ అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని షాప్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Karnataka 1: ‘కాంతారా ఛాప్టర్ – 1’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన
రోడ్లపైనే వ్యాపారాలు
రోడ్లపై వీధి వ్యాపారాల కార్యకలాపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్ ప్రక్కల స్థలాలను ఆక్రమించుకొని వివిధ రకాల వాణిజ్య దుకాణాలు వెలుస్తుండడంతో రోజురోజుకీ రోడ్డు కుచించుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గవర్నమెంట్ స్థలాలతో పాటు వాణిజ్య దుకాణాల సముదాయాల ముందు రోడ్లపైనే అద్దెకు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు షాప్ యజమానులు కొందరు మొగ్గు చూపుతుండడంతో ఈ సమస్య మరింత జటిలమవుతోంది. పెరుగుతున్న జనాభాకనుగుణంగా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ అధికారులు రోడ్ల విస్తరణపై దృష్టి సారించకపోవడంతో వీధి వ్యాపార నిర్వహణ అస్తవ్యస్తంగా మారి వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Also Read: Idly Kottu review: ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కొట్టు’ ఎలా ఉందంటే?