Kothagudem district: కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ చేయూత అందిస్తూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి కనీస సౌకర్యాలను అందజేయటమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. చర్ల మండలంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామాలైన 20 గ్రామాలకు మినీ రైస్ మిల్లులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. సుమారుగా రూ.50 లక్షల వ్యయంతో 20 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మినీ రైస్ మిల్లులను ఏర్పాటు చేశారు. మినీ రైస్ మిల్లు కొరకు ఏర్పాటు చేసిన షెడ్డుతో కలిపి ఒక్కో యూనిట్ విలువ రూ.2,50,000 ఖర్చుతో 20 గ్రామాలలో 20 యూనిట్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
రాళ్లపురంలో ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు మౌళిక సదుపాయాలను కూడా అందించటమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. తమ తమ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఏజెన్సీ గ్రామాలలోని యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. రాళ్లపురం గ్రామం నుండి జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో పాల్గొన్న ఆడమయ్యను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం అడమయ్యను ఎస్పీ గ్రామస్తుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.
Also Read: Mahesh Kumar Goud: మోదీ పదవుల కోసం పుట్టిన మనిషి.. ఇందిరమ్మతో పోలికేంటి?
మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు
నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అలాంటి అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించకూడదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసు శాఖ ఆదివాసి ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని, లొంగిపోయిన మావోయిస్టులకు కల్పిస్తున్న పునరావాస సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మావోయిస్టు పార్టీలో పనిచేసే సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. రాళ్లపురం గ్రామం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న పొడియం లక్ష్మి కుటుంబాన్ని సందర్శించి, ఆమె కుటుంబ సభ్యులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Khammam District: కొత్త రెవెన్యూ చట్టంతో.. సమస్యలకు చెక్!