Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ పట్టణాన్ని ఆనుకుని ఉన్న సిర్సపల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డ్‌పై స్థానిక ప్రజలు, నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కోదండరాం గ్రామాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాయకులు సబ్బని వెంకట్, తదితరులు డంపింగ్ యార్డ్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఆయనకు వినతిపత్రం అందజేశారు.
జవహర్ నగర్ లాంటి దుస్థితి రాకూడదు: ఎమ్మెల్సీ కోదండరాం
అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. సిర్సపల్లి గ్రామస్తుల అభ్యంతరాలు అత్యంత న్యాయసమ్మతమైనవని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా అక్కడ ఎనిమిది తొమ్మిది చెరువులు కలుషితమై, పశువులు కూడా నీళ్లు తాగలేని స్థితికి చేరాయి. సరిగ్గా ప్రాసెసింగ్ లేకపోవడం వల్ల భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. వ్యవసాయంపై ఆధారపడిన సిర్సపల్లి గ్రామానికి కూడా అటువంటి పరిస్థితి రాకూడదు. ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను” అని హామీ ఇచ్చారు.
Also Read: Huzurabad News: మిషన్ భగీరథకు తూట్లు.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు..?
ప్రాణసంకటంగా మారుతున్న డంపింగ్ యార్డ్: సామాజికవేత్త సబ్బని వెంకట్
సామాజికవేత్త,స్థానిక నాయకులు సబ్బని వెంకట్ మాట్లాడుతూ.. వేరే నియోజకవర్గ వ్యర్థాలను తెచ్చి సిర్సపల్లి నివాస ప్రాంతాలకు దగ్గరగా వేయడం దారుణమన్నారు. “వ్యర్థాలను కాల్చడం వల్ల గాలిలోకి విడుదలయ్యే కాడ్మియం, క్రోమియం వంటి రసాయనాల వల్ల చిన్న పిల్లలకు సైతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పంట పొలాల విలువ పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ పోరాటాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం” అని తెలిపారు. ఈ అంశంపై వచ్చే వారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు వెంకట్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జన సమితి నాయకులు ముక్కెర రాజు, తదితరులు పాల్గొన్నారు.గ్రామాన్ని కాపాడుకోవడానికి వెంకట్ చేస్తున్న ఈ పోరాటాన్ని కోదండరాం అభినందించారు.
Also Read: Huzurabad Area Hospital: ఏరియా హాస్పిటల్‌లో ఓ రేడియాలజిస్ట్ చేతిలో బందీ అయిన స్కానింగ్ సెంటర్!

