Sharada( IMAGE credit: swetcha reporer)
నార్త్ తెలంగాణ

Saradamma: శాస్త్రీయ సమాజ స్థాపనే ఆమె లక్ష్యం.. స్వప్న సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్

Saradamma: సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ ఆలోచనా విధానం, సమానత్వం అనే లక్ష్యాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ జయగోపాల్ గారు 1972లో భారత నాస్తిక సమాజం (Atheist Society of India)ను స్థాపించారు. భా.నా.స స్థాపనలో కీలక పాత్ర పోషించిన జయగోపాల్ సహచరి శారమమ్మ జీవితం అనేది సాదాసీదా కుటుంబ జీవితం కాదు అది పోరాటాలతో, త్యాగాలతో, సేవా ధర్మంతో నిండిన ఒక నిరంతర ప్రయాణం. డా. జయగోపాల్ జీవితాంతం తోడుగా నిలిచి, ఆయన రాసిన పుస్తకాల ప్రచురణలో, సమాజంలో నాస్తికత మరియు శాస్త్రీయ దృక్పథం వ్యాప్తిలో, కార్యక్రమాల నిర్వహణలో చాలా కృషి చేశారు.

శారదమ్మ బాల్యం కష్టాల మధ్య గడిచింది. ఆర్థికంగా బలహీనమైన కుటుంబంలో జన్మించారు. ఆకలి, అడ్డంకులు ఇవన్నీ ఆమె చిన్నతనంలోని సహచరుల్లా వెంటాడేవి. కానీ ఈ పేదరికం ఆమె హృదయాన్ని బలంగా చేసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే, సమాజపు ఆంక్షలను లెక్కచేయకుండా, డా. జయగోపాల్ గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ కాలంలో ప్రేమ వివాహం ఒక విప్లవమే. ఆయన నాస్తికుడు అని తెలిసినా, ఆ ఆలోచనల పట్ల గౌరవంతో, ఆమె కూడా ఆ భావజాలాన్ని స్వీకరించారు. ఆ నిర్ణయం అంత సులభం కాదు — కుటుంబ సహాయం లేదు, ఆర్థిక బలం లేదు. కానీ పరస్పర విశ్వాసం, ధైర్యం మాత్రమే వారికి తోడుగా నిలిచాయి.

 Also Read: Kothagudem: ఆపరేషన్ చేయూత.. 8 మంది మావోయిస్టుల లొంగుబాటు!

భర్తే గురువు

వివాహానికి ముందు చదువుకోలేకపోయినా, పెళ్లి తర్వాత జయగోపాల్ ఆమెకు అక్షరాలు నేర్పారు. ఒకప్పుడు అక్షరాలే తెలియని ఆమె, కొద్ది కాలంలోనే పత్రికలు, పుస్తకాలు చదివి చర్చించే స్థాయికి ఎదిగారు. భర్త రాసిన పుస్తకాలు, వ్యాసాలు, పత్రికలు అన్నింటిలోనూ ఆమె సూచనలు, సహకారం ఉండేది. ఇంటిపనులే కాక, ప్రచురణలు, ఆర్థిక వ్యవహారాలు, సమావేశాల ఏర్పాట్లలోనూ ఆమె ప్రధాన భాగస్వామిగా నిలిచారు.

జయగోపాల్ కు అచంచల మద్దతు

వివాహానంతరం శారద ఎదుర్కొన్న జీవితం అంత సులభం కాదు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, రోజువారీ జీవిత పోరాటం – ఇవన్నీ ఆమెను పరీక్షించాయి. అయినా, ఒక్కసారి కూడా వెనుదిరగలేదు. భర్త పుస్తకాలు రాయడం, వాటిని ప్రచురించడం, నాస్తిక సంఘ కార్యకలాపాలు – వీటన్నింటికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆమె ఎన్నో మార్గాలు అన్వేషించారు. కుటుంబాన్ని నడపడానికి ఆమె స్వయంగా కిరాణా షాపు నడిపారు, చెప్పల షాపు కూడా నిర్వహించారు. ఈ శ్రమ, త్యాగమంతా ఉద్యమ నాయకుడైన ఆమె భర్త యొక్క స్వప్నం నిలబెట్టడానికే. ఒక నిశ్శబ్ద సహాయకారిగా ఎప్పుడూ నిలిచారు. ఒక సారి కూడా ఫిర్యాదు చేయలేదు. నలుగురు పిల్లలను ఎంతో కష్టాల మధ్య పెంచుతూ, వారిని సమాజంలో మంచి స్థానానికి చేర్చారు. శారద గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగావకాశం వచ్చింది. కానీ ఆమె ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఎందుకంటే తన పిల్లల భవిష్యత్తు, కుటుంబ అవసరాలు, అలాగే భారత నాస్తిక సమాజం కార్యక్రమాలకు సమయం ఇవ్వడం ఆమెకు ముఖ్యమని భావించారు.

 Also Read: Viral Video: రూ.200 కోట్ల బంగ్లాలో.. వీధి కుక్కకు చోటిచ్చిన షారుక్.. మనసు గెలిచేశాడు భయ్యా!

సమాజమార్పు కోసం నిరంతర కృషి

జీవితంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆమె మనసు మాత్రం ఎప్పుడూ పెద్దదే. మాటలలోనైనా, చేతలలోనైనా ఎవరికైనా తోడుగా ఉండేందుకు ఎల్లప్పుడూ ముందుండేది. తన ఇల్లు ఎప్పుడూ ఒక సహాయ కేంద్రంలా ఉండేది. ఇంటికి ఎవరు వచ్చినా అందరికీ ఆమె ఆప్యాయత, ధైర్యం, సలహా అందించేవారు. వారిని భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేవారు కాదు. వృద్ధులు అయినా, చిన్న పిల్లలైనా — ప్రతి ఒక్కరికి సమానంగా గౌరవం, ప్రేమ చూపించేది. అది శారదమ్మ ప్రత్యేకత, మంచితనానికి నిదర్శనం

జ్ఞానం చీకటిని తొలగిస్తుంది

ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వరదల బాధితులకు ఆర్థిక సహాయం, వస్త్ర సహాయం అందించడంలో ముందుండేవారు. సమాజంలోని ఇతరులను కూడా ప్రేరేపించేవారు. మూఢనమ్మకాల నిర్మూలనకై మంత్రాలు, తాంత్రిక మాయలతో ప్రజలను మోసం చేసే వారిని నిలదీసేవారు. “జ్ఞానం చీకటిని తొలగిస్తుంది” అనే నమ్మకంతో గ్రామాల్లో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసేవారు. మహిళల హక్కుల కోసం పోరాటం చేసారు. కట్న వేధింపులకు గురైన మహిళలకు సహాయం చేసి, పోలీసు స్టేషన్‌వరకు వెళ్లి వారిని రక్షించేవారు. బాధలో ఉన్న ప్రతి మహిళకు ధైర్యం చెప్పేవారు. ఒకసారి విశాఖపట్నం జిల్లాలో మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ 1977లో నిర్వహించిన సమావేశంలో, ఆమె ధైర్యంగా నిప్పులపై నడిచారు.

చైతన్యపరిచే కార్యక్రమాలను విస్తృతం

ప్రజలు దీన్ని ఒక అద్భుతం అని, బాబాలు మాత్రమే చేయగల పని అని నమ్మేవారు. కానీ శారద గారు ఇది మాయ కాదని, దీని వెనక శాస్త్రీయ కారణం ఉందని ఆమె ప్రత్యక్షంగా నిరూపించారు.శారదమ్మ “భారత నాస్తిక సమాజం మహిళా విభాగం” లో కీలక పాత్ర పోషించారు. ఆమె కేవలం ఒక సభ్యురాలిగా కాకుండా, అధ్యక్షులుగా కూడా నిలిచారు. సమాజంలో మహిళలు కూడా ఆలోచించగలరని, నిర్ణయాలు తీసుకోగలరని ఆమె తన జీవన విధానంతో నిరూపించారు. ఆమె నాస్తిక మహిళా సంఘాన్ని ముందుండి నడిపిస్తూ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మూఢ విశ్వాసాల బారిన పడతారని భావించి, వారిని చైతన్యపరిచే కార్యక్రమాలను విస్తృతంగా చేశారు.

ఆమె దృఢసంకల్పం వల్ల నాస్తిక మహిళా సంఘం ఒక బలమైన వేదికగా మారింది. ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చారు. శారద డా. జయగోపాల్ తో కలిసి పుట్టపర్తి సాయిబాబా మోసాలను బహిర్గతం చేయడానికి పుట్టపర్తికి వెళ్లారు. వారి లక్ష్యం – ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న నిజాలను ప్రజల ముందుకు తీసుకురావడం. వారు అక్కడికి చేరకముందే పోలీసులు వారి బస్సును ఆపి వారిని వెనక్కి పంపించారు. దీనివల్ల సభ జరగకపోయినా, శారద ధైర్యసాహసాలు ఆ సంఘటనలో స్పష్టంగా కనిపించాయి.

ఒక అచంచల సహచరి

డాక్టర్ జయగోపాల్ కు శారద కేవలం భార్య మాత్రమే కాదు ఒక స్నేహితురాలు, సహచరి, సహాయకారి. ఆయన రచనల వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి ఆమె. భారత నాస్తిక సమాజాన్ని బలపర్చడంలో, ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె పాత్ర అపారమైనది. కుటుంబాన్ని నడిపించడానికి ఆమె చేసిన త్యాగాలు, చూపిన సహనం అమూల్యమైనవి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, భర్తకు అండగా నిలబడి, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు భరించారు.

అహర్నిశలూ కృషి

ఒకవైపు భర్తకు సాహిత్య సహచరిగా తోడుగా ఉంటే, మరోవైపు తల్లిగా తన పిల్లల పట్ల అపారమైన ప్రేమ చూపారు. భానాస స్థాపన నుండి 2010 వరకు మూఢనమ్మకాల నిర్మూలన కోసం శారద గారు అహర్నిశలూ కృషి చేశారు. అనంతరం అనారోగ్యం బారిన పడినప్పటికీ, ఇంటి వద్ద నుంచే తనకు సాధ్యమైనంత వరకు ఆ ఉద్యమానికి అండగా నిలిచారు. 29 ఆగస్టు 2020న కరోనా కారణంగా ఆమె కన్నుమూసినా, శారద గారి జ్ఞాపకాలు, ఆమె త్యాగం, సేవ, అచంచల మనోబలం ఎప్పటికీ మర్చిపోలేము.

ఆమె ఒక ఆలోచన, ఒక శక్తి, ఒక ప్రేరణ. ఆమె లేకపోయినా, ఆమె త్యాగాలు ఎప్పటికీ జయగోపాల్ పుస్తక రచనల్లో వెలుగుతూనే ఉంటాయి. డాక్టర్ జయగోపాల్ పేరు వినబడేంతకాలం, ఆయన రాసిన పుస్తకాలు చదవబడేంతకాలం, ఆయన ఆలోచనలు నిలిచేంతకాలం శారద గారి జ్ఞాపకం కూడా అంతే వెలుగుతుంది. జయగోపాల్ గారిని ఎప్పటికీ మరువలేము, అలాగే శారద గారినీ మరవలేం. జయగోపాల్ ప్రస్తావన వచ్చేంత కాలం శారద ప్రస్తావన కూడా వస్తుంది.

 Also Read: Viral Video: ఏం గుండెరా వాడిది.. భారీ కోబ్రాను చిట్టెలుకలా పట్టేశాడు..!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు