Jangaon District: నీవు సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్నావా.. అయితే నాదగ్గర డిపాజిట్ గా డబ్బులు పెట్టు.. నేను ఎమ్మెల్యేకు ఎంత చెప్పితే అంతే. ఎమ్మెల్యేకు నేను ఎంత చెప్పితే అంతే.. నా మాట కాదనదు.. కాకుంటే నీ జేబులో ఎంతుందో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నాకు చూపించు.. లేదంటే నా దగ్గర రూ.10లక్షలు డిపాజిట్ చేయి.. చేసావో నీవే సర్పంచ్ అభ్యర్థివి.. లేదనుకో నీకు టికెట్ రాదు.. అంతా నీ ఇష్టం.. నీవే ఆలోచించుకో… అంటూ ఒక నేత. మరో నేతది మరో వెరైటీ.. ఏముందిరా.. వాడికి ఎవ్వడు ఓట్లు వేయడు.. నేను నిన్నే గెలిపిస్తా.. చూస్కో.. నేనున్నాంటే.. నీవు సర్పంచ్‌గా గెలిచినట్టే.. అంతా నాదే భారం.. కాకుంటే నాకు కొంత ఇచ్చుకో.. ఇలా సాగుతున్నాయి గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతల యవ్వారం. ఇది జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దందా. జనగామ జిల్లాలో కాంగ్రెస్‌కు పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక జనగామకు మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి(Kommuri Pratap Reddy) ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలకు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇక మూడో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అయితే మండల, గ్రామానికి చెందిన అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు సంపాదించుకునే పనిలో పడ్డారు. కొందరు డబ్బులు సంపాదించాలనే ద్యేయం పెట్టుకోగా, కొందరు తమ వర్గాలను పెంచుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా ద్వితీయశ్రేణి నేతలు వేస్తున్నచిత్ర విచిత్ర కుటిల కుతంత్ర రాజకీయాలు ఇప్పుడు ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
టికెట్‌కు రేటు ఫిక్స్
జనగామ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కు ఎవ్వరు లేరు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మూడు ముక్కలాట సాగుతుంది. ఇంతకాలం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి(Kommuri Pratap Reddy) గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అయితే ఇంతకాలం ఇక్కడ పనిచేసిన మాజీ డీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర అయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఈ నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. ఆ వర్గం కొందరిని సర్పంచ్ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఇక ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన మాజీ జడ్పీ చైర్‌పర్సన్ లాకావత్ ధన్వంతి(Lakavat Dhanvanti) వర్గం సర్పంచ్ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. దీంతో జనగామ నియోజకవర్గంలో అంతా గందరగోళం నెలకొంది. ఇంతకు సర్పంచ్ అభ్యర్థులు ఎవ్వరో అధికారికంగా తేల్చుకోలేక పోతున్నారు. ఇదే అదనుగా కొందరు ద్వీతీయ శ్రేణి నేతులు సర్పంచ్ అభ్యర్థులకు గాలం వేసి రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఇది కేవలం జనగామ నియోజకవర్గంలోనే లేదు. స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లోనూ ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం ఎక్కువగా ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో సీనియర్ లీడర్లుగా చెలామణి అవుతున్న కొందరు నేతలు సర్పంచ్ అభ్యర్తులకు రేట్లు ఫిక్స్ చేసి వసూలు కార్యక్రమంకు శ్రీకారం చుట్టారని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో అటు పార్టీ నాయకురాలు సింగపురం ఇందిర, ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్గాల నడుమ అభ్యర్తుల ఎంపిక ఇబ్బందికరంగా మారింది.
Also Read: Breakfast 2.0: మెున్న డీకే.. నేడు సిద్ధరామయ్య.. కర్ణాటకలో అల్పాహార పాలిటిక్స్!
నేతల తీరుతో వర్గాలుగా పార్టీ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీలో పోటీ అధికంగా నెలకొంది. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామనే ధీమాతో అనేక మంది అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ఇదే అదనుగా ద్వితీయ శ్రేణి నేతలు డబ్బులును గుంజే పనిలో పడ్డారు. ఇది ఎక్కువగా పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో నెలకొని ఉంది. పార్టీ సీనియర్ నేతలుగా చెలామణి అవుతున్న నేతలు తమ వర్గాలను పెంచి పోషించుకునేందుకు అభ్యర్థుల ఎంపికలో పక్షపాతం చూపుతున్నారనే అపవాదు ఉంది. ఇక బీ ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్(Congress) లో చేరిన నేతలు తమతో పార్టీలో చేరిన వారిని, డబ్బులు ఇచ్చేవారిని, తమ వర్గంను పెంచుకుని రాజకీయంగా చక్రం తిప్పాలని ఉబలాటపడుతున్న నేతలు గ్రామాల్లో రెండు వర్గాలుగా పార్టీని చీల్చుతున్నారు. మేము ఎమ్మెల్యే మేడమ్‌కు ఎంత చెప్పితే అంతా.. నీవు పార్టీ అభ్యర్థివి నీవే.. నిన్ను నేను గెలిపించుకుంటా.. నీవే బరిలో ఉంటున్నావు.. ఇంకో వర్గం వాడు పెట్టినోడికి ఓట్లు పడవు.. నీకే పడుతాయి.. నీవు కూడా బరిలో ఉండు.. నాకు కొన్ని డబ్బులు ఇవ్వు నిన్ను నేను గెలిపించుకుంటా.. నీ డిపాజిట్ నా దగ్గర పెట్టు నిన్ను గెలిపిస్తా.. పక్కా అంటూ మాయమాటలు చెప్పడంతో క్యాడర్‌లో నిరాశ ఆవహిస్తుందని కార్యకర్తలు ఆవేధన చెందుతున్నారు. ఇక ఒక వర్గం మాత్రం పార్టీ కోసం పనిచేసిన వారిని అభ్యర్థులుగా పెడుతుంటే.. వారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్(BRS) నుంచి వచ్చిన నేతలు పార్టీని చీల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇది పార్టీకి నష్టం చేకూర్చడంతో పాటు, ప్రతిపక్ష గులాబీ పార్టీకి లాభం కలిగే చర్యగా పార్టీ క్యాడర్ భావిస్తున్నారు. పార్టీ నేతలు పార్టీలో జరుగుతున్న ఈ తీరును పసిగట్టక పోవడంతో వారి ఆటలు సాగుతున్నాయని పలువురు అంటున్నారు. ద్వీతీయ శ్రేణి నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఎమ్మెల్యే, పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు చేస్తున్న ఇలాంటి చర్యలను ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు చెపితే మాకు ఎక్కడ అభ్యర్థిత్వం దక్కదో అనే భయంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇలాంటివి గ్రహించి వాటిని అరికట్టకుంటే పార్టీకి మొదటికే మోసం రాక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు.
Also Read: 19 Minutes Viral Video: టీనేజర్స్ ప్రైవేటు వీడియో.. యువతి చనిపోయిందంటూ పుకార్లు.. నిజమెంత?

