Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం సల్కాపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక సర్పంచ్ అభ్యర్థి చేసిన సంచలన ప్రకటన స్థానికంగా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఆంజనేయులు గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పత్రంపై ప్రకటించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. తాను ఎన్నికైతే ఈ హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తానని, లేకపోతే పదవి నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించడం మరింత సంచలనం సృష్టించింది.
రైతులకు ఉపశమనం
ఆంజనేయులు ఇచ్చిన హామీలలో అనేక వినూత్న, కీలకమైన అంశాలు ఉన్నాయి. గ్రామ రైతు పొలాలకు ట్రాక్టర్ ద్వారా దున్నుటకు, గుంటికపాయుటకు గంటకు ₹600, ఖర్గెటకు గంటకు ₹1000 చొప్పున మాత్రమే ఛార్జ్ చేస్తానని తెలిపారు. గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం వంటి మౌలిక వసతులను హామీలలో పేర్కొన్నారు. అంతేకాక, చర్చి, టెంపుల్ దగ్గర బోరు మోటార్ కుళాయిల వసతి, కట్టమీద టెంపుల్‌కు వెళ్ళడానికి చెరువు కట్ట తూము దగ్గర ఎక్కేందుకు మెట్ల ఏర్పాటు చేస్తానని ఒప్పంద బాండ్‌లో స్పష్టం చేశారు.
సంక్షేమం, భద్రతకు హామీ
గ్రామంలో సైకిల్, మోటార్ బైక్ ఉన్న లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి ఉచిత హెల్మెట్ పంపిణీ చేస్తానని ప్రకటించారు. బీసీ శ్మశాన వాటికకు ఫెన్సింగ్, బోరు మోటార్‌తో నీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. విద్య కొరకు ప్రత్యేక చొరవ, వితంతు మహిళలకు ఇంటి నిర్మాణం కోసం ₹10,000 ఆర్థిక సహాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, కల్యాణ కానుక, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలను తన మేనిఫెస్టోలో చేర్చారు. గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి నల్ల వచ్చే విధంగా ఏర్పాటు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని ఆంజనేయులు హామీ ఇచ్చారు. వృద్ధులకు ఉచిత కంటి ఆపరేషన్లు, పరీక్షలు, కళ్ళజోడు, చేతి కర్రలు, వికలాంగులకు స్టాండ్ల పంపిణీకి కృషి చేస్తానని పేర్కొన్నారు.
నిబద్ధతతో కూడిన కృషి
స్కూల్‌కి విద్యా వలంటరీల నియామకం, చదువు రాని వారికి రాత్రి బడి ఏర్పాటు చేస్తారు. కుల మతాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల కోసం డీ ఫ్రీజర్, వాటర్ ట్యాంక్ ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్, వాల్మీకి మహర్షి విగ్రహాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా, ప్రభుత్వం నుండి వచ్చే ఏ పథకం వచ్చినా గ్రామంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి చేరే విధంగా కృషి చేస్తానని సల్కాపురం గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఆంజనేయులు 22 హామీలను వంద రూపాయల బాండ్‌లో పేర్కొన్నారు. గతంలో సర్పంచ్‌గా చేసిన అనుభవంతో తమ గ్రామ అభివృద్ధికి నా శాశ్వత కృషి చేస్తానని సల్కాపురం గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఐదు హామీలను నెరవేరుస్తానని ప్రకటించారు. సాధారణంగా చిన్న పదవులకు జరిగే ఎన్నికలలో ఈ స్థాయిలో హామీలు ఇవ్వడం, వాటిని బాండ్‌పత్రంపై ప్రకటించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఈ స్థానిక ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
Also Read: Jogulamba Gadwal: సిసిఐ కొనుగోలు ఊపందుకునేనా..! పత్తి రైతుకు ప్రకృతి సహకరించేనా..!
