Road Safety: హుజురాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు, క్లీనర్లకు రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) కంచి వేణు(Kanchi Venu) డ్రైవర్లకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఒక్కరి ప్రాణ రక్షణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల వాహనాలను నడిపే డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వందలాది మంది చిన్నారుల ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయనే విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలని సూచించారు. రహదారి నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాదని, ప్రతి ఒక్కరి ప్రాణ రక్షణ కోసమని ఆయన స్పష్టం చేశారు. డ్రైవర్లు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు వాడకూడదని, అతివేగం మరియు అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ముఖ్యంగా జంక్షన్ల వద్ద, మలుపుల వద్ద పాదచారులను గమనిస్తూ వాహనాలను నియంత్రిత వేగంతో నడపాలని కోరారు.
Also Read: Drainage Problem: రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు.. రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
డ్రైవర్లకు కంటి చూపు సమస్యలు
ప్రతి పాఠశాల వాహనానికి ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని రకాల పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్(Fitness certificate) తప్పనిసరిగా ఉండాలని, వాహనంలో అగ్నిమాపక యంత్రాలు మరియు ప్రథమ చికిత్స కిట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైవర్లకు కంటి చూపు సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, శారీరక, మానసిక దృఢత్వంతో ఉన్నప్పుడే స్టీరింగ్ పట్టాలని హితవు పలికారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా డ్రైవర్ల ప్రవర్తనను, వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బందితో పాటు పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లు మరియు నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

