Rice Millers Scam: తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై మరోసారి తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి అప్పగించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న రైస్ మిల్లర్లు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోలు చేయటం వెనుక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రైస్ మిల్లర్లు రాజకీయ నాయకులను ఆర్థిక ప్రలోభాలతో, బడా అధికారులను ఒత్తిడి చేసి తమ దందాను సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలో పలువురు మిల్లర్లు ప్రభుత్వానికి భారీగా సీఎంఆర్ బకాయి పడిన సంగతి తెలిసిందే. దారి మళ్లిన సీఎంఆర్‌ను భర్తీ చేసేందుకా? లేక ప్రభుత్వం అందిస్తున్న బోనస్ రూ.500ను ఖాజేసేందుకా? అనే అంశంపై మిల్లర్ల మంత్రాంగంపై సస్పెన్స్ నెలకొంది.
ఏపీ, మహారాష్ట్ర నుంచి రాక
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తెనాలి జిల్లాల నుంచి, అలాగే మహారాష్ట్ర నుంచి ధాన్యం సీజన్ ప్రారంభం నుంచే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి లారీల్లో తరలివస్తోంది. వాడపల్లి, సూర్యాపేట జిల్లా సరిహద్దుల నుంచి, నాగార్జునసాగర్ బోర్డర్ నుంచి మిర్యాలగూడ సహా ఇతర ప్రాంతాలకు ఈ ధాన్యం చేరుతోంది. వాడపల్లి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద ఇప్పటికే 71 లారీల ధాన్యాన్ని పట్టుకొని వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఈ నెల 3వ తేదీ రాత్రి ఏపీకి చెందిన 6, మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న 5 లారీలతో కలిపి మొత్తం 11 లారీల ధాన్యాన్ని నల్గొండ జిల్లా ఆలగడప టోల్ గేట్ వద్ద పట్టుకొని మిర్యాలగూడ రూరల్ పీఎస్‌కు తరలించారు. మిల్లర్లు తమ అక్రమ దందాను సాగించేందుకు అధికారులపై ఒత్తిడి పెంచి ధాన్యం కొనుగోలు వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ధాన్యం కొన్ని మిల్లులకు చేరుతుండగా మరికొన్ని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Gadwal District: గట్టు ఎత్తిపోతల పూర్తయ్యేనా? 1.32 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంపెంపుకు అంగీకారం!
ధాన్యంపై విచారణ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2025-26 ఖరీఫ్‌లో సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అంచనా వేయగా, ఇప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు కలిగిన మిర్యాలగూడలో 108 మిల్లులలో వడ్ల కొనుగోలు జరుగుతోంది. ఈ సీజన్‌లో లోకల్ మిల్లర్లు ఇప్పటికే 5,30,250 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. పట్టుబడిన ధాన్యాన్ని ఎక్కడ కొనుగోలు చేశారు, ఎందుకు కొనుగోలు చేశారు, ఎటు తరలిస్తున్నారు అన్న విషయమై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపడితే మిల్లర్ల బాగోతం బయటపడనుంది. పట్టుబడిన ధాన్యంపై మిర్యాలగూడ డీఎస్పీ రాజ శేఖర రాజు స్పందించారు. ‘రాష్ట్ర, జిల్లా సరిహద్దుల నుంచి ఈ ప్రాంతానికి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన నిఘా వేశాం. పట్టుబడిన ధాన్యంపై వ్యాపారులు ఇచ్చిన బిల్లులను పరిశీలిస్తున్నాం. పూర్తిస్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం’ అని డీఎస్పీ తెలిపారు.
Also Read: Minister Adluri Laxman: విద్యార్థులు కాదు వాల్లు మా కన్న బిడ్డలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

