Warangal District: స్మైల్ డీజీ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాల దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు, ఉపాధ్యాయులు గురువారం బంద్‌ను పాటించి, హనుమకొండ(Hanumakonda) కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్‌లో పాల్గొని పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీగా తరలివచ్చి హనుమకొండ కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి విద్యార్థి సంఘాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చర్యలు తీసుకోవాలని..
ఈ సందర్భంగా పోలీసులు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమానుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నుండి తమకు, తమ విద్యా సంస్థలకు భద్రత కల్పించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. స్మైల్ డీజీ స్కూల్(Smile DG School) యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాల నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Terror Accused Dr Shaheen: మహిళా టెర్రర్ డాక్టర్.. ఈమె గురించి తెలిస్తే.. బుర్ర బద్దలు కావాల్సిందే?
తొర్రూరులోనూ భారీ ర్యాలీ..
హనుమకొండతో పాటు, తొర్రూరులోని ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్(Private School Management), ఉపాధ్యాయులు సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు, మేనేజ్‌మెంట్ సభ్యులు చేతుల్లో ప్లకార్డులతో శాంతియుతంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా కొనసాగారు. విద్యా సంస్థల భద్రతను కాపాడాలని, విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. నిరసనలో మాట్లాడిన స్కూల్ ప్రతినిధులు, “విద్యా సంస్థలు సమాజ భవిష్యత్‌కు పునాది. యాజమాన్యంపై దాడులు జరగడం బాధాకరం. ప్రభుత్వ అధికారులు వెంటనే దర్యాప్తు చేసి, బాధ్యులను శిక్షించాలని” విజ్ఞప్తి చేశారు. యాజమాన్య సభ్యులు ఉపాధ్యాయుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యా సంస్థకు భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ర్యాలీలో పలువురు ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బంది, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: KTR: పోలింగ్ బూత్ ఏజెంట్లతో కేటీఆర్ హరీష్ రావు భేటి.. ఎందుకో తెలుసా..!
