Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ లో అభ్యర్థుల తుది జాబితా అనంతరం ప్రచారానికి కొద్దిరోజులు సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.మొదటి,రెండవ విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, నేడు మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కాగానే అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తుంటారు. ఒక్కోచోట సర్పంచ్ ,వార్డు సభ్యుల నామినేషన్లు అత్యధికంగా నమోదయ్యాయి. ఇప్పటికే పల్లెల్లో ఎవరు నిల్చోవాలి.వద్దన్నది చర్చించుకుంటున్నారు. బుజ్జగింపులకు సమయం లేకపోవడంతో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. రెబల్స్ ను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మార్గాల ద్వారా రాజీ కోసం తాపత్రయపడుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం తనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఒకసారి అవకాశం ఇవ్వండి
సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆశవాహులు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజల మద్దతు ఉన్న నాయకుల మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు. వారి ద్వారా గ్రామాలలో బలమైన కుల సంఘాల నుంచి పోటీ లేకుండా ఇతర అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చేటట్లు ప్రయత్నాలు చేస్తున్నారు.గ్రామాల్లో పోటీ చేసే ఆశావాహులు పార్టీల మద్దతు ఉంటే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక వైపు సమయం లేకపోవడం మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం బలమైన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు వారు ప్రకటించిన అభ్యర్థులే కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో ఎలాగైనా స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని ఆశవాహులు గ్రామ పెద్దలు,,విద్యావంతులు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు కోరుతున్నారు. గతంలో జడ్పిటిసి, ఎంపీటీసీలుగా చేసిన వారు సైతం ప్రస్తుతం సర్పంచ్ పదవికి ఉత్సాహం చూపుతున్నారు.
గెలవాలనే పట్టుదలతో
జిల్లాలో సర్పంచ్ వార్డు పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు ఏకగ్రీవం కోసం స్థానిక ప్రజాప్రతినిల సహాయంతో ప్రయత్నాలు కొనసాగిస్తుండగా కుల సంఘాల నాయకులు పెద్దమనుషుల సాయంతో ఎవరి ప్రయత్నం వారి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని కేటీ దొడ్డి గట్టు, గద్వాల మండలాల్లో పలు జీపీలలో ఒకటి నుంచి మరికొన్ని నామినేషన్లు దాఖలు చేసిన నేటి మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో గ్రామ పెద్దల సమక్షంలో ముందస్తుగా ఒప్పంద పత్రంపై రాసుకున్న ప్రకారం విత్ డ్రా అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు ప్రకటించిన నగదును వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే మిగతా స్థానాల్లో సైతం చాలా తక్కువ మంది పోటీల్లో ఉండేలా బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోటీ వద్దంటూ దాడులు
సర్పంచ్ పదవిపై వ్యామోహంతో ఒక వర్గం వారు మరొక వర్గంపై పోటీ చేయవద్దంటూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆంజనేయులపై మరో అభ్యర్థి వర్గీయులు ఎన్నికల నుంచి తప్పుకోవాలని దాడి చేశారు. సామాజిక బహిష్కరణ సైతం చేశారని, గ్రామాభివృద్ధి కోసం తాను ప్రకటించిన 22 హామీలను ప్రకటించినందుకు, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.తనకు ప్రాణహాని ఉందని స్వతంత్ర అభ్యర్థి తెలిపారు. ఇప్పటికే ఎస్సై కు ఫిర్యాదు చేశానని, తనకు అండగా నిలవడంతో ప్రాణాలతో బయటపడ్డానన్నారు. ఐజ మండలం ఉత్తనూరు గ్రామంలో సైతం ఎస్సీ మహిళకు అవకాశం రాగా ఏకగ్రీవం అయ్యేందుకు మరో సామాజిక వర్గానికి చెందిన మహిళ నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో జ్యోతి, ఎస్సై శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని ఆ మహిళతో నామినేషన్ వేయించారు.
