Singur Project: సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టనున్నందున త్రాగునీటి సమస్య తలెత్తుతుందన్న ఆందోళన జిల్లా ప్రజలకు అవసరం లేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ హమ్‌జద్ హుస్సేన్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్‌లు స్పష్టం చేసారు. ప్రాజెక్టుకు సంబంధించిన కట్ట రివీట్‌మెంట్ పనులను ఏ విధంగా చేపట్టాలన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం సంగారెడ్డి(Ranagreddy) జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును జిల్లా అధికారులతో కలిసి సందర్శించింది. ప్రాజెక్టు కుడి, ఎడమ వైపున ఉన్న కట్ట ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. సుమారుగా 800 మీటర్ల పొడవున ఇరువైపులా రివీట్‌మెంట్ పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ పనులను చేపట్టేందుకు నీటిని ఒకేసారి గేట్‌ల ద్వారా మంజీర నదిలోకి తరలించకుండా, పనులు చేపడుతున్నతీరును బట్టి దశల వారిగా వదిలిపెడతామని, ఒకేసారి నీటిని ఖాళీ చేసే ఆలోచన లేదన్నారు. ప్రాజెక్టులోని నీటిని ఒకేసారి ఖాళీ చేస్తారని, ప్రత్యామ్నాయంగా త్రాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం ఈ కమిటీని ప్రాజెక్టు వద్ద స్వయంగా పరిశీలించేందుకు పంపిందన్నారు.
వారం రోజుల్లో నివేదిక ఇస్తాం
తాము ఈ రోజు పరిశీలించిన చెరువు కట్టలను, పనులను ఏ విధంగా చేపట్టాలన్న విషయమై వివిధ శాఖలకు సంబంధించి అధికారులమంతా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. తాము ఇచ్చిన నివేదిక తర్వాత 15 రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని ఈఎన్‌సీ హమ్‌జద్ హుస్సేన్(Hamzad Hussain) అన్నారు. డెప్త్ ఎంత వరకు నీటిని ఉంచాలో కూడా పరిశీలిస్తామని, మిషన్ భగీరథకు అవసరమైన నీటిని సాధ్యమైనంతవరకు ఉంచేందుకు చర్యలుంటాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టబోయే పనులు 50 ఏళ్ల వరకు ఉండేలా చేపడతారన్నారు.
కెమికల్స్ వాడకుండానే పనులు
తాగునీటి ప్రాజెక్టు కావడంతో కెమికల్స్ వాడకుండా రివిట్‌మెంట్ పనులను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నీరు ఉన్న ప్రాజెక్టులో కాపర్ డ్యామ్‌ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల్లోనే నిర్మించవచ్చునని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల వచ్చిన తర్వాతనే పనులను ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు. వారితో పాటు హైదరాబాద్(Hyderabad) వాటర్‌వర్క్ సీజీఎం బ్రిజేష్, ఇరిగేషన్ శాఖ సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ పోచమల్లుతో పాటు ప్రాజెక్టు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.
Also Read: Bigg Boss Telugu 9: అందరూ ఒక్కరికే సపోర్ట్ చేస్తారా అంటూ రీతూ ఫైర్.. అడ్డంగా దొరికేసిన తనూజ!
