Kuchukulla Rajesh Reddy: నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, గత రెండేళ్లలో దాదాపు వేయి కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (Kuchkulla Rajesh Reddy) తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో ఎండబెట్ల వద్ద హై లెవల్ బ్రిడ్జికి 10కోట్లు, సీసీ రోడ్లకు 20కోట్ల రూపాయలు, బస్టాండుకు 12కోట్లు, సిర్సవాడ బ్రిడ్జికి 20కోట్లు, యంగ్ ఇండియా స్కూల్ కు 200కోట్లు, అసంపూర్తిగా ఉన్న మార్కండేయ రిజర్వాయర్ కు 25కోట్లు మంజూరు చేయించి ప్రారంభించామన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలు పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తానన్నారు.
మున్సిపాలిటీలో 45కోట్లతో సీసీ రోడ్లు
అలాగే స్ర్తీశక్తి భవన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలభవనం, అలాగే ప్రజల కోరిక మేరకు ఆర్టీఏ కార్యాలయం మార్చామన్నారు. ముస్లింల షాదీఖానా కోసం 3కోట్లకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు త్వరలో మంజూరు అవుతాయన్నారు. తెల్కపల్లికి డిగ్రీ కళాశాల మంజూరు అయ్యిందని అన్నారు. అన్ని మండలాల్లో అభివృద్ధి జరిగేలా చూస్తామన్నారు. ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో దాదాపు వేయి కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో 45కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టామని అన్నారు. పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందన్నారు. అలాగే ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం, పింఛన్లులాంటి ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు నాగర్‌కర్నూల్ నుండి తరలిపోయిన బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కేటీఆర్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదు
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా తాను పాల్గొంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8,9,10తరగతులు చదివే విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా (షూస్)బూట్లు అందిస్తామన్నారు. వట్టెం పంపు హౌజ్ కు కరెంటు మంజూరు చేయించామని, నిర్వాసితులకు ఆర్థిక శాతం అందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటి పోరుతో కేటీఆర్ సీఎం రేవంత్ ని విమర్శిస్తున్నారన్నారు. తనకంటే ముందు రేవంత్ సీఎం కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోవడం లేదన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రేవంత్ సీఎం అయ్యారన్నారు. కేటీఆర్ ముందు ఇంటి పంచాయతీ తేల్చుకోవాలని, ఇంటి ఆడపడుచు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదన్నారు. బల్లగుద్ది చెప్తున్నా రాష్ట్రంలో, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

