Gutha Sukender Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరిపై ఎంత శ్రద్ధ తీసుకున్నారో అదే స్థాయిలో కృష్ణా నదిపై చూపలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానన్నారు. మండలిలోని తన ఛాంబర్‌లో మీడియా చిట్ చాట్ నిర్వహించారు. కవిత మొదట రాజీనామా పీఏ ద్వారా పంపించారని, ప్రెస్ మీట్‌లో లేఖ పంపినట్టు చెప్పారన్నారు. ఇలా చేస్తే రాజీనామా అమోదించలేమని, అందుకే తాజాగా నేరుగా కలిసి రాజీనామా అమోదించాలని కోరారని చెప్పారు. కాకపోతే, ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారని తెలిపారు. రాజీనామా చేసే వారు ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని, శాసనసభ్యులు, మండలి, పార్లమెంట్‌లో ఎక్కడైనా ఇది జరిగేదే అని వివరించారు. రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను ఆమె వివరించారని, దాన్ని తాను ఆపలేనని అన్నారు.
రాష్ట్రంలో ఇంకో పార్టీకి స్కోప్ లేదు
మొదటి సారే కవిత నేరుగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించే వాళ్లమని స్పష్టం చేశారు. ఇటీవలే సెషన్‌కు వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించుకోమని చెప్పానన్నారు. లేదు ఆమోదించాలి, అంతకంటే ముందు మాట్లాడే అవకాశం కల్పించాలని ఆమె కోరినట్టు తెలిపారు. ఎవరైనా తమ భాష విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని, ఇది అందరు నాయకులకు వర్తిస్తుందని సూచించారు. రాష్ట్రంలో మరో పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉన్నదని తాను అనుకోవడం లేదన్నారు. ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయని, వాటిని నిలబెట్టుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు.
Also Read: Legislative Council: కాళేశ్వరం నివేదిక పత్రాలు చించి.. విసిరిన బీఆర్ఎస్ నాయకులు
హిల్ట్ పాలసీలో స్కాం ఏముంటుంది?
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు చాలా ఇబ్బందులు ఉన్నాయని మండలి చైర్మన్ అన్నారు. ఇది అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. ఎంత డెవలప్మెంట్ చేసినా ప్రజలు గుర్తించుకోవడం లేదని, వ్యక్తిగతంగా సహాయం చేసినా మర్చిపోతున్నారని చెప్పారు. హిల్ట్ పాలసీలో స్కామ్ లేదన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి పాలసీ తీసుకొచ్చినప్పుడు సభలో పాస్ చేశామని గుర్తు చేశారు. ‘‘పొల్యూషన్ కంట్రోల్ అనేది ముఖ్యం. మూసీ పొల్యూషన్ నల్గొండ వరకు వస్తున్నది. సిటీ పొల్యూషన్ వేరు ఇండస్ట్రియల్ పొల్యూషన్ వేరు. చౌటుప్పల్‌లో గ్రౌండ్ లెవెల్ వరకు పొల్యూషన్ చేరింది. హిల్ట్ పాలసీ ముఖ్య ఉద్దేశం పొల్యూషన్ ఫ్రీ చేయడమే. సిటీ బయటకు కంపెనీలు తరలించడం కరెక్ట్. ఇందులో కరప్షన్‌కు తావు ఎక్కడ ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. యూరియా యాప్‌తో నష్టం ఏమీ లేదని, చదువు లేని వారికి కొంత ఇబ్బంది ఉంటుందని అన్నారు. యూరియా వాడకం తగ్గించేందుకు కూడా ఇది ఇండైరెక్ట్‌గా పనికొస్తుందని చెప్పారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం మార్చడం వల్ల రాష్ట్రాలకే నష్టమని, 60-40 అనేది సరైనది కాదని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.
Also Read: Madhu Yashki Goud: జైలుకు వెళ్లనున్న కేసీఆర్, హరీష్.. మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

