Mulugu District: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారు మామిడిగూడెం సమ్మక్క సారలమ్మ లేబర్ సొసైటీ కాంట్రాక్టర్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నూతన ఇసుక పాలసీ ని పట్టించుకోకుండా తన ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా అయితే కూలీల సాయంతో రోజుకు 50 ట్రాక్టర్లను మాత్రమే ఇసుక రీచ్ నుంచి తరలించాల్సి ఉందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
అయితే ఇక్కడ కాంట్రాక్టర్ నూతన ఇసుక పాలసీని పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగానే ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే సొసైటీ కి సంబంధించి గ తేడాది 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించిన కాంట్రాక్టర్. నేడు అదే సొసైటీ మీద పర్మిషన్ తీసుకొని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
ఇసుక రీచ్ నుండి జేసీబీల సాయంతో టిప్పర్ల ద్వారా అధిక ట్రిప్పులు తరలింపు
సాధారణంగా అయితే ఇసుక రీచ్ ల నుండి గ్రామస్తులకు జీవనోపాధి కలిగే విధంగా ట్రాక్టర్లతో ఇసుకను తరలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ మాత్రం అందుకు విరుద్ధంగా 8 జెసిబి ల సాయంతో 16 టిప్పర్లలో ఇసుకను నింపుతూ రెండు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను డంపు చేస్తున్నాడు. సదరు ఇసుకను డంపు చేసిన ప్రాంతాల నుండి హైదరాబాదుకు తరలిస్తున్నాడు.
Also read: Rain Alert in Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్కు తీసుకువెళ్లే లారీ ఓనర్ ల నుంచి అదనంగా రూ.1600 కాంట్రాక్టర్ అక్రమంగా వసూలు చేస్తున్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అధికలోడు వల్ల కమలాపురం వే బ్రిడ్జిల వద్ద రహదారులపై లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ వ్యవహారం… అధికారుల కళ్ళుగప్పి దందా
ఇసుక పాలసీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ రాత్రింబవళ్లు ఇసుకరీచుల నుండి టిప్పర్లు లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నాడని లేబర్ సొసైటీ సంబంధిత గ్రామ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ఎక్స్ట్రా లోడింగ్ చేస్తున్నట్లు సైతం విమర్శలు ఉన్నాయి. ఇసుక సొసైటీ రిచ్ వద్ద సీసీ కెమెరాలు అమర్చాల్సి ఉండగా వాటిని అమర్చలేదని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
సీసీ కెమెరాలు అమర్చితే తన దందా బయటపడుతుందని కోణంలోనే వాటిని అమర్చలేదని గ్రామస్తులు చెబుతున్నారు. గోదావరికి అతి సమీపంలో ఒక డంపింగ్, ప్రధాన రహదారికి సమీపంలో మరో ఇసుక డంపును ఏర్పాటు చేసి అక్కడి నుండి అనుమతులకు మించి ఇసుకను తరలిస్తున్నాడని గ్రామస్తులు వివరిస్తున్నారు.
జెసిబిల సాయంతో టిప్పర్లు లారీలను ఇసుక లోడ్ చేయడంతో గ్రామస్తులకు ఆదాయం రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ వ్యవహార శైలిపై అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.