Vikarabad district: ఓవైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasada Kumar), జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు(Min Sridhar Babu), ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prateek Jain) లతో కలిసి శంఖుస్థాపనలు చేశారు. రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని అర్హులైన పేదవారికి కార్డులను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల కుటుంబాలకు గాను 95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణాల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 మంజూరు చేస్తున్నామని, ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుడికి రూ.5 లక్షల చొప్పున నగదు జమ చేయడం జరుగుతున్నదని చెప్పారు.
భవిష్యత్తులో గేమ్ చేంజర్లుగా
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి వైద్య సదుపాయం నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల రూపాయలను అందించడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నదని, ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భవిష్యత్తులో గేమ్ చేంజర్లుగా మారతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. మరోవైపు జనాభాలో సగభాగమైన మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందజేయడం జరుగుతున్నదని, ఒక సంవత్సరంలోనే 21 వేల కోట్ల రుణాలను అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే అని అన్నారు.
రైతుల బాధలను తెలుసుకున్న ప్రభుత్వం
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా మహిళలకు ఆర్టీసీ(RTC) బస్సులను అద్దెకివ్వడం జరుగుతున్నదని, సోలార్ పవర్ ప్లాంట్(Solar Power Plant) ను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం మహిళలకు తోడ్పాటు అందిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల పక్షపాతిగా రైతుల బాధలను తెలుసుకున్న ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో ముందుకు వెళుతున్నదని అన్నారు. లో వోల్టేజ్ ని అధిగమించేందుకు రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్తు సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జనాభా ప్రాతిపదికన బిసి(BC) రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్రానికి సమర్పించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నామని బట్టి అన్నారు.
Also Read: Cancer: షాకింగ్.. ధూమపానం చేయని వారిలో కూడా తల, మెడ క్యాన్సర్?
రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీ మేరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని రెండు లక్షల వరకు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. రేషన్ కార్డులు రానివారు మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డు తీసుకున్న వారికి వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని రానున్న రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ప్రజలకు మేలు జరిగే పథకాలు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) మాట్లాడుతూ తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇలా పేదలకు మేలు జరిగే పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోట్ పల్లి ప్రాజెక్టు(Kotpalli Project) అభివృద్ధి కోసం రూ.90 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి(Manohar Reddy) మాట్లాడుతూ గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి పనులను నాసిరకంగా చేశారన్నారు. కాగ్నా నదిపై బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మాణం చేసి రెండేళ్లు అవుతున్నదని, పనుల్లో నాణ్యత లేక భారీ రంద్రం పడిందన్నారు. దీనిపై తగు విచారణ జరిపించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: Sports Grounds: రాష్ట్రంలో అలంకార ప్రాయంగా క్రీడా మైదానాలు