Ponguleti Srinivas Reddy: తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న (Bhu Bharati Act) భూ భారతి చట్టానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. కొత్త చట్టం అమలులో జాప్యం జరుగుతుందని, ఇది సరైన విధానం కాదని, కలెక్టర్లు సీరియస్‌గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, సీఎస్ కే రామకృష్ణారావులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే దాని ఫలితాలు సామాన్యులకు అందుతాయని అన్నారు. మూడు దఫాలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సామాన్యులను, ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం ఉందని, ఇది పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు.
Also Read: Gold Rates (23-07-2025): గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయ్.. వరుసగా రెండో రోజు బాదుడు..
కోర్టు తీర్పునకు ముందే..
రెవెన్యూ సదస్సుల్లో 8.65 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ప్రధానంగా సాదాబైనామా, సర్వేనెంబర్ మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్‌కు సంబంధించి సుమారు 6 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని ఐదు విభాగాలుగా విభజించి ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలన జరిపి ఆగస్టు 15వ తేదీలోగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, కోర్టు తీర్పు కోసం వేచిచూడకుండా దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం కోసం సిద్ధం చేసుకోవాలన్నారు.
జిల్లాల్లోని అసైన్డ్‌ల్యాండ్, లబ్ధిదారుల వివరాలను ఈ నెల 30వ తేదీ లోగా ప్రభుత్వానికి పంపించాలని కలెక్టర్లకు సూచించారు. దరఖాస్తుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరస్కరించకూడదని, తిరస్కారానికి గల కారణాలను లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జీపీఓలకు, జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు పరీక్ష నిర్వహిస్తున్నామని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేసుకొని పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలన్నారు.
పేదలకు ఇబ్బందులు రాకూడదు..
పేదవాడి సొంతింటి కల అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ధరలు, చెల్లింపులు, ఇసుక, సిమెంట్, స్టీల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏ సమస్య రాకుండా చూడాలని అన్నారు. అలాగే ధరల నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేసేలా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలతో సంబంధం లేకుండా నిరుపేదలైతే ఇల్లు కేటాయించాలన్నారు.
ఏడాదిన్నరలో కొండంత చేశాం..
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ, చేసిన మంచి పనులను సవివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. దీంతో ప్రతిపక్షం గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతుందని, ప్రజలకు కళ్లకు గంతలు కట్టేలా వ్యవహరిస్తుందని మంత్రి వివరించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలనే గాక ఇతర అంశాలలో ప్రజోపయోగకర పనులు చేపట్టామని, 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే ఇంత భారీ నియామకాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణను అగ్రపథంలో నిలిపామన్నారు. ఇవేగాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం, మహిళలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రైతుభరోసా పెంపు, రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ ఛార్జీలు 40 శాతం పెంపు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పంపిణీ ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో చేశామన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలలో చేయలేనిది ఏడాదిన్నరలో చేసి చూపించామన్నారు. వీటన్నింటినీ జనాల్లోకి విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీఎం సీపీఆర్ఓ మల్సూర్లు ఉన్నారు.
Also Read: Chandrababu: ఏపీలో పంటల వివరాలపై సమగ్రంగా ‘శాటిలైట్ సర్వే’