Mahabubabad SP: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంతెనలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరూ నీట మునిగిన రోడ్లు, వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అలాగే చేపల వేటకు వెళ్లరాదని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటకూడదని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లరాదని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు మొత్తం జలమయం
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 1077 సమాచారం అందించాలి. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు మొత్తం జలమయమైన క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1077 కు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలోని చెరువులు, వాగులు వద్ద పోలీసు పెట్రోలింగ్‌ను పెంచి ప్రజల్లో అప్రమత్తత కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా వంతెనలు, చప్టల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నదని, అధికారులు మరియు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు
