Gadwal District: జోగుళాంబ గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి జోరుగా నడుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, కొంతమంది నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు, పంపిణీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆబ్కారీ, పోలీస్ శాఖలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం మద్యం, డబ్బు పంపిణీపై అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ, అందుకు విరుద్ధంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు నిరాటంకంగా నడుస్తున్నా, వాటిని నియంత్రించేందుకు ఇంతవరకు ఎక్సైజ్ శాఖ లేదా పోలీస్ శాఖల నుంచి ఎలాంటి యాక్షన్ ప్లాన్ కరువైంది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా, మద్యం షాపుల నుంచి పెద్ద ఎత్తున్న మద్యం తరలించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డంప్ చేసుకుంటున్నట్లు ప్రజల్లో చర్చ నడుస్తోంది.
అక్రమంగా సిట్టింగ్‌లు
బెల్టు షాపులకు అనుగుణంగా అక్రమంగా సిట్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ నిర్వాహకులు మందుబాబులను ఆకట్టుకుంటున్నారు. పోటీ పెరగడంతో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఇళ్లలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, బార్ అండ్ రెస్టారెంట్ల మాదిరిగా చికెన్, మటన్, గుడ్లు, ఆమ్లెట్ వంటి ఆహార పదార్థాలను తయారు చేసి అందిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా హైవేలపై ఉండే దాబాలలో సైతం ‘3 పెగ్గులు 6 గ్లాసుల’ దందా విచ్చలవిడిగా నడుస్తోంది. దాబాలలో మద్యం విక్రయాలు, సిట్టింగులకు అనుమతులు లేకపోయినా, అధికారులతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాలతో వ్యాపారాలు కొనసాగుతున్నాయన్న విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా దాబాలలో మద్యం సిట్టింగ్‌లు యథేచ్ఛగా నిర్వహించడం గమనార్హం.
Also Read: Gadwal District: కొత్త వైన్స్ కు పంచాయతీ కిక్క.. ఈ నెల మొత్తం ఎన్నికల మయం!
ఎంసీసీ బృందాలు ఏం చేస్తున్నట్లు?
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) పకడ్బంధీగా అమలు చేస్తున్నామని చెబుతున్న తనిఖీ బృందాలు, నగదు తరలింపును అడ్డుకుంటున్నప్పటికీ, మద్యం సరఫరాను మాత్రం విస్మరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కేవలం నగదు మాత్రమే ఉపయోగపడుతుందనే భావనలో అధికారులు ఉన్నట్లు కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వైన్ షాపుల నుంచి పెద్ద మొత్తంలో మద్యం తరలించి స్టాక్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
కుటుంబాలపై తీవ్ర ప్రభావం
అధికారుల నిర్లక్ష్యం కారణంగా బెల్టు షాపుల్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడమే కాక, ఏకంగా గుడిసెలు వేసి సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఈ అక్రమ వ్యాపారాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోజంతా కష్టపడే రైతులు సైతం క్రమంగా మద్యానికి అలవాటు పడుతూ, వ్యవసాయ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు. దీంతో కుటుంబాలలో మానవ సంబంధాలు దెబ్బతినడంతో పాటు, ఆర్థిక తగాదాలకు కారణమై చిన్నారులు సైతం మానసికంగా నలిగిపోతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు విచ్చలవిడి మద్యం అమ్మకాలపై దృష్టి సారించి, పచ్చని పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు బెల్ట్ షాపుల నిర్మూలనపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Gadwal District: గ్రామాల్లో జోరందుకున్న ప్రచారం.. అభివృద్ధికై బుజ్జగింపులు ప్రలోభాలు బేరసారాలు

