Illegal Liquor: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంతో పాటు పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. గతంలో కేవలం పట్టణాలలో లభ్యమయ్యే మద్యం నేడు పచ్చని పల్లెలో యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేస్తున్నడంతో వ్యవసాయంపై ఆధారపడే కష్టజీవులను సైతం మద్యం వైపు ఆకర్షించేలా చేస్తూ వారి డబ్బును, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా గ్రామీణ ప్రాంతాలలో అక్రమ మద్యం దుకాణాలు వెలుస్తుండడంతో కుటుంబ పోషణ కోసం కాయకష్టం చేస్తూ శ్రమించే తత్వానికి బదులు మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను సైతం సక్రమంగా నిర్వహించలేక కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులకు గురి చేసేలా పరిస్థితులు మారిపోతున్నాయి. గల్లీకో బెల్టు షాప్ ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దండుకుంటోంది ఈ అక్రమ మద్యం మాఫియా. వైన్ షాప్(Wines Shop) లకు సమయ వేళలు ఉండగా గ్రామాలలో అనధికారికంగా దుకాణాలు, కిరాణా షాప్ లలో మద్యం అందుబాటులో ఉంచుతుండడంతో తెల్లారక ముందే చాయ్ కి బదులు కలర్ నీళ్లు తాగేందుకు ప్రజలు మొగ్గు చూపే పరిస్థితిని కల్పిస్తున్నారు.
లెక్కకు మించి బెల్ట్ షాపులు
మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నడంతో వైన్ షాపుల నిర్వాహకులు ఇస్టారీతిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 34 వైన్ షాపులు ఉండగా ఒక్కో షాప్ పరిధిలో కనీసం 40 నుంచి 50 బెల్ట్ షాపులు అనుబంధంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాయి. తమ టార్గెట్లు చేరుకునేందుకు బెల్ట్ షాపులను వైన్స్ నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పదుల సంఖ్యలో వైన్ షాపులు ఉండగా లెక్కకు మించి బెల్టు షాపులు దళారులు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ(MRP) ధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపులు నిర్వాహకులు ఒక్క క్వార్టర్ మీద 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా మందుబాబుల అలవాటులకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తూ అక్రమ సంపాదనకు తెర లేపుతున్నారు.
Also Read: TG Liquor Tenders 2025: రంగారెడ్డి డివిజన్‌లో కొత్తగా 19 వైన్స్‌లు.. మందకొడిగా టెండర్లు?
అక్రమంగా సిట్టింగ్లు సైతం..
జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలలో వైన్ షాపులకు సమీపంలో సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. చుక్కకూ ముక్క ఇష్టపడే వారికి అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ మందు బాబులను తృప్తిపరుస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వారికి సిట్టింగ్లలోనే మద్యం సరఫరా చేస్తూ స్నాక్స్, ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతున్నారు.
పల్లెల్లో పెరుగుతున్న బెల్ట్ షాప్ లు
ఒకప్పుడు బెల్ట్ షాప్ లు రెండు మూడు భయంగా గ్రామాలలో నిర్వహించేవారు. కానీ నేడు ఈజీ సంపాదన కోసం పైరవీకారుల ద్వారా ఎక్సైజ్ అధికారులను ప్రసన్నం చేసుకుని బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. దీంతో కిరాణాల్లో దొరికే వస్తువుల మాదిరిగా మద్యం విక్రయాలు సైతం అదే స్థాయిలో అందుబాటులో ఉంచుతుండడంతో ఏ రాత్రి వెళ్ళినా మందు బాబులకు మద్యం లభిస్తుంది. ఎన్నికల సమయంలో అడపదడప దాడులు చేసే ఎక్సైజ్ శాఖ పోలీసులు అనంతరం గ్రామాల వైపు కనితి చూడకపోవడంతో ఇస్టారీతిన అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
నిద్రావస్థలో ఎక్సైజ్ శాఖ
విచ్చల విడిగా బెల్ట్ షాపులలో మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. గ్రామాలలో నిత్యం పర్యవేక్షణ చేస్తూ బెల్టు షాపులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి మామూళ్ల మత్తులో జోకుతూ అక్రమ మద్యం షాపులు నిర్వాహకులను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఎక్సైజ్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Thummala Nageswara Rao: మహిళా శక్తి చీరలు పంపిణీకి సిద్ధం చేయాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
