Thummala Nageswara Rao: నవంబర్ 15 నాటికి 65 లక్షల చీరలు సిద్ధం చేసి జిల్లా గోడౌన్స్ కు తరలించి పంపిణీకి సిద్ధం చేయాలని మంత్రి తుమ్మలనాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో చేనేత కార్మికులకు మహర్దశ పట్టనుందని తెలిపారు. సచివాలయంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో పాటు జౌళి టెస్కో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర0 వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరలు చీరల పంపిణీ కోసం 4 కోట్ల 34 లక్షల మీటర్ల క్లాత్ అవసరం కాగా, ఇప్పటి వరకు 3కోట్ల 65 లక్షల మీటర్ల క్లాత్ పవర్ లూమ్ కార్మికులు ఉత్పత్తి చేశారన్నారు.
ప్రతి నెల 18 నుంచి 22 వేల పైన వేతనం
ఇప్పటి వరకు 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోడౌన్స్ కు టెస్కో ఆధ్వర్యంలో సరఫరా చేసినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఉత్పత్తి కోసం 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఉపాధి కలిగిందని, దాంతో నేత కార్మికులకు ప్రతి నెల 18 నుంచి 22 వేల పైన వేతనం పొందుతున్నారన్నారు. చేనేత కార్మికులు రుణమాఫీ అంశంపై ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సాధ్యమైనంత త్వరలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి వారి అకౌంట్స్ లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.
ఏడాది 48.80 కోట్లు
6,780 మంది చేనేత కార్మికులకు లక్ష వరకు వ్యక్తిగత రుణమాఫీతో రుణ విముక్తులు కానున్నారని తెలిపారు. తెలంగాణ నేతన్న భరోసా పథకంలో భాగంగా చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ ఏడాది 48.80 కోట్లు కేటాయించామన్నారు. ఈ పథకంలో భాగంగా చేనేత ఉత్పత్తులు చేసిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 18 వేలు, అనుబంధ కార్మికులకు 6 వేలు ప్రోత్సాహకం కింద అందించడం జరుగుతుందని , ఈ పథకంలో ఏడాదిలో రెండు విడతలుగా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని, చేనేత కార్మికులకు మేలు చేసేలా నిబంధనలు సరళీకృతం చేసి అమలు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఇప్పటి వరకు 13,371 మంది నమోదు
తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద ఇప్పటి వరకు 13,371 మంది నమదు చేసుకోగా ఇంకా 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ పథకంలో 18 వేల చేనేత కార్మికులు లబ్ది పొందనున్నారని తెలిపారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు సంస్థల నుంచి వస్త్ర కొనుగోలుకు వంద శాతం ఆర్డర్స్ టెస్కో ద్వారా తీసుకుని చేనేత, పవర్ లూమ్ సంఘాలకు వర్క్ ఆర్డర్ ఇచ్చి నిరంతరం పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు టెస్కో కు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ ని యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్ లూమ్ పార్క్ లోకి మార్చాలని సత్వరమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Ramachandra Rao: యూరియా కొరతపై తుమ్మలతో చర్చకు సిద్ధం!
