Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా
Bus Accident ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు

Bus Accident: ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని మొద్దులుగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల శ్రీ వివేకానంద విద్యాలయంకు చెందిన స్కూల్ బస్సు  సాయంత్రం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. గణేష్పాడు–సుబ్బాయిగూడెం మధ్య ఉన్న పంట కాలవలో బస్సు ఒరిగిపోయింది. ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ సిబ్బంది వేంసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

స్కూల్ నిబంధనలు పాటించిందా?

డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపించడం వల్లే ప్రమాదం జరిగిందనీ, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం, ఇది ఘటనపై మరింత అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ మద్యం సేవించాడా? స్కూల్ నిబంధనలు పాటించిందా? అనే అంశాలపై విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఫీజుల కోసం కక్కుర్తి పడుతున్నారని, బస్సు సామర్థ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించడం అంతే కాక డ్రైవర్ మద్యం తాగి వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రధాన కారణమై ప్రమాదానికి దారితీసిందినీ స్థానికులు పేర్కోన్నారు. గణేష్‌పాడు గ్రామస్తులు వెంటనే స్పందించి, బస్సులో చిక్కుకున్న చిన్నారులను బయటకు తీసి ప్రాణాలతో కాపాడారు. వారి సమయస్పూర్తి వల్లే పెద్ద ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది.

Also Read: College Bus Accident: ఘోర ప్రమాదం.. కాలేజీ బస్సు బోల్తా.. కళ్లెదుటే 60 మంది స్టూడెంట్స్..

వాహనాలు అన్నీ ఫిట్‌నెస్‌లో ఉన్నాయా?

ఈ సంఘటనతో వివేకానంద స్కూల్ యాజమాన్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. స్కూల్ బస్సులు, వాహనాలు అన్నీ ఫిట్‌నెస్‌లో ఉన్నాయా? వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్స్ ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఈ సంఘటన స్కూల్ బస్సుల భద్రతపై మరోసారి తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తూ ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతను లాభాల కోసం పణంగా పెట్టడం తగదు అని వారు హెచ్చరిస్తున్నారు.

స్కూల్‌లకు సంబంధించిన లైసెన్సులు

ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యాలయాలపై పర్యవేక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి ఇది. స్కూల్‌లకు సంబంధించిన లైసెన్సులు, గుర్తింపు పత్రాలు, విద్యార్థుల భద్రత, స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ వంటి కీలక అంశాలపై సంబంధిత అధికారులు నిజంగా తనిఖీలు నిర్వహిస్తున్నారా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. విద్యాశాఖ పరిధిలో ఉన్న ఎంఈఓ (మండల విద్యాధికారి) పాత్ర ఇక్కడ కీలకం. ప్రైవేట్ అయినా, ప్రభుత్వమైనా ప్రతి విద్యాలయాన్ని కనీసం సంవత్సరానికి ఒకసారి తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉంది. స్కూల్‌కు చెల్లుబాటు అయ్యే గుర్తింపు ఉందా, తరగతి గదులు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా, విద్యార్థుల సంఖ్యకు తగిన సదుపాయాలున్నాయా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

ప్రమాదం జరిగినా చట్టపరంగా రక్షణ

అదే విధంగా స్కూల్ బస్సుల విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, మద్యం పరీక్ష వంటి అంశాలపై స్పష్టమైన నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల తనిఖీలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సుల ఫిట్‌నెస్ రిపోర్టులు, స్కూల్ లైసెన్సులు ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్లీ సమీక్షించకపోవడం, అక్రమాలపై ప్రశ్నించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాణాలు పాటించిన విద్యాలయాల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అవి ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకుంటాయి, అవసరమైన అన్ని లైసెన్సులు అప్డేట్‌లో ఉంచుతాయి, డ్రైవర్ల అర్హతలు పరిశీలిస్తాయి. ఇలాంటి స్కూల్‌లకు తనిఖీలపై భయం ఉండదు, ప్రమాదం జరిగినా చట్టపరంగా రక్షణ ఉంటుంది.

నివేదికలు ఉన్నాయా లేదా?

ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకం నిలబడుతుంది. కానీ ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల విషయంలో అధికారుల మౌనం, నిర్లక్ష్యం లేదా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయన్న ఆరోపణలు విద్యాశాఖ వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పిల్లల భద్రత వంటి సున్నితమైన అంశంలో “నివేదికలు ఉన్నాయా లేదా?” అనే సందేహం ఉండటం కూడా అత్యంత ప్రమాదకరం. మొత్తానికి, ఎంఈఓ స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకూ క్రమం తప్పకుండా భౌతిక తనిఖీలు, పారదర్శక రిపోర్టులు, చర్యలు లేకపోతే ప్రమాణాలు పాటించే విద్యాలయాలు నష్టపోతాయి, నిర్లక్ష్యంగా వ్యవహరించే సంస్థలు మాత్రం తప్పించుకుంటాయన్న భయం వ్యక్తమవుతోంది. పిల్లల భవిష్యత్తు కాపాడాలంటే నియంత్రణ వ్యవస్థ మాటల్లో కాకుండా పనిలో కనిపించాల్సిన అవసరం ఉందన్నది విద్యావేత్తల స్పష్టమైన అభిప్రాయం.

Also Read: Karnataka Bus Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సుకు మంటలంటుకొని 17 మంది సజీవ దహణం

Just In

01

India ODI Squad: కెప్టెన్‌గా గిల్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటించిన బీసీసీఐ

Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

RBI on Rs 2,000 Note: మీ వద్ద రూ.2000 నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోండి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై అసలు విషయాలు చెప్పిన దర్శకుడు మారుతి.. ఎందుకు చేశారంటే?

Gold Silver Prices: బాబోయ్… వెనిజులాపై అమెరికా దాడితో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా?