Jogulamba Gadwal: జిల్లాలో అనేకమంది గొర్రెలు, మేకలు పెంపకంతో జీవనోపాధి పొందుతున్నారు. గత రెండున్నరేళ్లుగా నట్టల నివారణ మందులు అందకపోవడంతో మూగజీవాలు బలహీనపడి కొన్ని జీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పెంపకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నట్టల ముందుకు ఒకసారికి 80 జీవాలకు గాను ఒక లీటర్ అవసరం కాగా ప్రైవేట్ వెటర్నరీ షాప్ లో ఒక లీటర్ కు 3 వేల చొప్పున ఖర్చు అవుతోంది.
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా వ్యాప్తంగా 5.40 లక్షల గొర్రెలు, 65 వేల మేకలు ఉన్నాయి. గతంలో యేట నాలుగు సార్లు మూగజీవాలకు నివారణ మందు తాగించేవారు. దీంతో జీవాలు ఆరోగ్యంగా బలంగా ఉండేవి. ప్రస్తుతం జిల్లా పశువైద్య కార్యాలయంలో నట్టల నివారణ మందు అందుబాటులో లేకపోవడంతో కడుపులో పురుగులు పెరిగి జీవాలు సరిగ్గా మేత మేయడం లేదని పెంపకం దారులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్దికి సర్కారు ప్రాధాన్యత.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జీవాల పాల ఉత్పత్తిపై ప్రభావం
రెండున్నరేళ్లలో పది సార్లు మందు తాగించాల్సి ఉంది కానీ ఇప్పటివరకు మందుల పంపిణీ జరగడం లేదు. నట్టలు పెరగడంతో వాటి పాల ఉత్పత్తి, మాంసం దిగుబడి తగ్గిపోతోందని గొర్రెల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని జీవాలు రక్తహీనతకు గురై బలహీన పడుతున్నాయి. వర్షాకాలంలో జీవాల పాదాలు నాని కుంటుతాయని, ఇలా అనేక రూపాలలో జీవాల సంరక్షణ కష్టతరమవుతోందని జీవాల పెంపకం దారులు వాపోతున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల్లో ఉచితంగా దొరికే నట్టల నివారణ మందులు రెండున్నర ఏళ్ళుగా లభించకపోవడంతో పెంపకం దారులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పంపిణీ చేయాలని జీవాల సంరక్షకులు కోరుతున్నారు.
బయట కొనుగోలు చేస్తున్నాం: కేసన్న, షాబాద్, ఇటిక్యాల మండలం.
నాకున్న 150 గొర్రెలను కాపాడుకునేందుకు నట్టల నివారణ మందులు బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. పలు దఫాలుగా వివిధ రకాల జబ్బులకు మందులు కొనాల్సి రాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.ప్రభుత్వం స్పందించి మందులు పంపిణీ చేయాలి.
త్వరలో పంపిణీ చేస్తాం : జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు
గత రెండేళ్లుగా నట్టల నివారణ మందులు అందుబాటులో లేకపోవడం వాస్తవమే. జిల్లాలో మందుల కొరత దృష్ట్యా అవసరమయ్యే మందుల ఇండెంట్ ను ఉన్నతాధికారులకు పంపగా ఇటీవలే స్టాకు జిల్లా కార్యాలయానికి చేరింది. వారం, పది రోజులలో లబ్ధిదారులకు మందులను పంపిణీ చేస్తాం.
