Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయం ఏదైనా ఉందంటే అది గద్వాల(Gadwala) తహసీల్దార్ కార్యాలయమే అని చెప్పాలి. జిల్లాల విభజన, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు క్రమంలో జిల్లా కేంద్రానికి నడిబొడ్డున కొనసాగుతున్న ఈ తహశీల్దార్ కార్యాలయంలో దళారులు రాజ్యమేలుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రెవెన్యూ(Revenue) కార్యాలయానికి ఏదైనా పనిపై వెళ్లాలంటే ఉద్యోగులు ఎన్ని కొర్రీలు పెడతారోనని అంతా ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ మాత్రం దళారుల తీరుతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తహశీల్దార్ స్నేహితుడు కావడంతో
కార్యాలయానికి వచ్చిన వారితో తహశీల్దార్(MRO) నా స్నేహితుడు అంటూ జములమ్మ ఆలయ కమిటి ఓ మాజీ డైరెక్టర్ కార్యాలయంలో తిష్ట వేసి నా ద్వారా పనులు అవుతాయని హల్చల్ చేస్తున్నాడని వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో భూముల(Land) ధరలు కోట్లలో ఉండడంతో రియల్ ఎస్టేట్(Real Estate) వెంచర్లు, భూముల కొనుగోలు అమ్మకాలు, లిటిగేషన్ భూముల వ్యవహారాలలో పనులు చేయిస్తానని ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యులు తమ పనుల కోసం రాజకీయ నాయకులని సంప్రదించినా ఈ దళారుడి మాటకు ఆఫీసు సిబ్బంది అన్ని పక్కన పెట్టి పని చేయాల్సిందే. దీంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నా ఇలాంటి వారితో కొందరు అధికారులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.
Also Read: Bhadradri kothagudem: సీసీ కెమెరాలతో నేరాలను అరికట్టవచ్చు: ఎస్పీ రోహిత్ రాజు
ఎలాంటి పనైనా నిమిషాల్లో అయిపోతుందని
గద్వాల తహశీల్దార్(MRO) కు ఆ మాజీ ఆలయ డైరెక్టర్ కు స్నేహబంధం ఉంది. ఈ చనువుతో నిత్యం తహశీల్దార్ కార్యాలయంలో ఉంటూ కార్యాలయ పెద్దకు ప్రజలకు మధ్య చలామణి అవుతున్న ఆ ఆలయ కమిటి మాజీ డైరెక్టర్ కు డబ్బులు ఇస్తే తహశీల్దార్ కార్యాలయంలో ఎలాంటి పనైనా నిమిషాల్లో అయిపోతుందని కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి తరచుగా వస్తుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో కొందరు అధికారులు సిబ్బంది అందుబాటు లేకపోయినా కార్యాలయ ఆవరణలో పడిగాపులు కాస్తుంటారు.
ఇటీవల రేషన్ కార్డు(Ration card)లో పేర్ల నమోదు, మార్పులు చేస్తున్న విషయంలో సర్వర్ పని చేయకపోవడంతో కాలు అరిగేలా తిరిగిన ప్రయోజనం లేక దళారుల వైపు చూడడంతో వారికి డిమాండ్ పెరిగింది. కార్యాలయం వెలుపల వివిధ దరఖాస్తులను నింపే దళారులు సైతం మేము మొత్తం పని చేయిస్తామని పనిని బట్టి రేటును నిర్ణయిస్తూ వినియోగదారుల జేబును ఖాళీ చేస్తున్నారు. తహశీల్దార్(MRO) సైతం తమ కులం(Cast) వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణ ఉంది. ప్రభుత్వ పథకాల అమలులో బిజీగా ఉండడంతో ఒక పని కోసం తరచుగా రావాల్సి వస్తుందని భావనతో విసుగెత్తి ఇలాంటి దళారులకు పనిని బట్టి ముట్టజెప్పి పని అయ్యేలా చూసుకుంటున్నారు. సాయంత్రం అయిందంటే చాలు మరో నలుగురు దళారులు కార్యాలయంలో వాలిపోయి తమ వారి పనులను చక్కదిద్దుకుంటున్నారు.
Also Read: India On US Tariff: ట్రంప్ టారిఫ్ లొల్లి.. దీటుగా బదులిస్తూ కేంద్రం సంచలన ప్రకటన!
పర్యవేక్షణ లేకపోవడంతో
ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాలను మండల స్థాయి అధికారులు గ్రామాలలో అమలు చేస్తుంటారు. ఇందిరమ్మ ఇల్లు(Indiramma’s house), కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, భూ భారతి దరఖాస్తులు పరిష్కారం, భూమి కొనుగోలు అమ్మకాలు విషయంలో స్లాట్ బుకింగ్ ద్వారా మండల తహశీల్దార్ కార్యాలయంలో నిత్యం కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. అంతేగాక విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు అనేక ఇతర సేవలను ఈ కార్యాలయం ద్వారానే ప్రజలు పొందాల్సి ఉంటుంది. వీటిని పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు ప్రజలు ఇచ్చే దరఖాస్తులను వివిధ కారణాలతో కొర్రీలు పెడుతూ సమయం వృధా చేస్తున్నారని విసుగు చెంది దళారులను ఆశ్రయిస్తున్నారు.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని మరో నలుగురు దళారులు కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాల సముదాయంలో కలెక్టర్, కార్యాలయం పక్కనే ఆర్డిఓ(RDO) ఉన్నా ఉమ్మడి జిల్లా నాటి పాలన పరిస్థితులే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు తరచుగా కార్యాలయాలు తనిఖీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకోని అలసత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ విషయమై తహశీల్దార్ వివరణ కోరగా ఈ విషయం నా దృష్టికి రాలేదని, కార్యాలయంలో వ్యవహారాల సక్రమంగానే నడుస్తున్నాయని, కావాలనే కొందరు పనులు గాక అసంతృప్తితో మాపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
Also Read: Banakacherla: బనకచర్ల రాజకీయం.. మళ్లీ మొదలు!