India On US Tariff: భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం పన్నులు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జరిమానాతో కలిపి ఆగస్టు 1 నుంచి ఈ ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. సుంకాలంటూ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ తనదైన శైలిలో దీటుగా స్పందించింది. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
‘ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం’
రష్యా నుంచి చమురు, సైనిక సామాగ్రి కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై ప్రతీకార సుంకాలు సహా పెనాల్టీ కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President) తాజాగా హెచ్చరించారు. దీనిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అమెరికా అధ్యక్షుడి ప్రకటనను గమనించాము. దాని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నాము. గత కొన్ని నెలలుగా భారత్ – అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. మేము ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాము’ అని ప్రకటన విడుదల చేసింది.
‘దేశ ప్రయోజనాలే ముఖ్యం’
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో దేశ ప్రయోజనాలే ముఖ్యమని కేంద్రం తాజా ప్రకటనలో మరోమారు స్పష్టం చేసింది. ‘రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
పన్నులపై ట్రంప్ వ్యాఖ్యలు ఇవే!
అంతకుముందు భారత్ పై పన్నులు విధించే విషయమై సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ (Truth) లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గుర్తుంచుకోండి.. భారత్ మనకు మిత్ర దేశం అయినప్పటికీ వారితో మేము చాలా తక్కువ వాణిజ్యం చేశాము. ఎందుకంటే వారు విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. వారు ఎల్లప్పుడు తమ సైనిక పరికరాలలో ఎక్కువ భాగాన్ని రష్యా నుండి కొనుగోలు (Bilateral trade) చేస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్ లో హత్యలు ఆపాలని అందరూ కోరుకుంటున్న సమయంలో రష్యా నుంచి పెద్ద మెుత్తంలో చమురు కొనుగోలు చేశారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి 25% సుంకం, ఆంక్షలకు విరుద్దంగా రష్యాతో చమురు కొనుగోలు చేసినందుకు పెనాల్టీ భారత్ చెల్లించాలి’ అంటూ ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read: Kingdom genuine Review: కింగ్డమ్ సినిమా జెన్యూన్ రివ్యూ.. కొండన్నకి హిట్ పడిందా?
భారత్‌పై ప్రభావం
ట్రంప్ ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే భారత్ లోని కీలక రంగాలపై పెను ప్రభావం పడే అవకాశముంది. ఈ సుంకాలు.. ఆటోమొబైల్స్, ఆటో భాగాలు, స్టీల్, అల్యూమినియం, స్మార్ట్‌ఫోన్లు, సోలార్ మాడ్యూల్స్, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, కొన్ని ప్రాసెస్ చేసిన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి. అయితే ఔషధాలు, సెమీకండక్టర్లు మరియు కొన్ని కీలక ఖనిజాలు ఈ సుంకాల నుంచి మినహాయించబడ్డాయి. భారత్ ఈ సవాలును ఎదుర్కొనేందుకు ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం, దేశీయ సంస్కరణలపై దృష్టి సారించడం వంటి మార్గాలను ఎంచుకునే అవకాశముందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సుంకాలు 2026 ఫైనాన్షియల్ ఇయర్ వరకూ ఉంటే దేశ జీడీపీ 0.2% నుంచి 0.5% వరకు క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు.