Copper Wire Theft: అంతర్ జిల్లాల వ్యాప్తంగా వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాయపోల్ పోలీస్ స్టేషన్(Rayapol Police Station)లో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు మీడియాకు వివరాలు వెల్లడించారు. అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులోని గుర్రలసోఫా ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మూడు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళ్తున్న నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారణ చేపట్టగా గత కొంతకాలంగా సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి, రాయపోల్, తొగుట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పది దొంగతనాలు, మెదక్ జిల్లా చేగుంటలో ఒకటి, మేడ్చెల్ జిల్లా శామీర్‌పేటలో మరో దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడైందని తెలిపారు.
రాత్రి వేళల్లో గ్రామ శివార్లలో..
వ్యవసాయ భూముల్లోని బోర్‌వెల్ మోటార్ కేబుల్ వైర్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో గ్రామ శివార్లలో కాపర్ వైర్లను దొంగిలించి వాటిని కాల్చి స్క్రాప్ షాపులకు విక్రయిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారని విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి రూ.70 వేల విలువైన 90 కిలోల కాపర్ వైర్లు,రూ.2.10 లక్షల విలువైన మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును ఛేదించిన తొగుట సీఐ ఎస్.కే.లతీఫ్, రాయపోల్ ఎస్సై మానసతో పాటు పోలీసు సిబ్బందిని సిద్ధిపేట్ సీపీ విజయ్ కుమార్ అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: Gongidi Sunitha: మేము కన్నెర్ర చేస్తే గ్రామాల్లో తిరగలేవు జాగ్రత్త: గొంగిడి సునీత ఫైర్..!

