Jogulamba Gadwal: జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్మాణ రంగం వేగవంతం కావడంతో ఇసుకకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే, జిల్లాలోని తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఇసుక క్వారీలకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నప్పటికీ, క్వారీ నిర్వాహకులు ఇసుక సరఫరాను నిలిపివేశారు. ఇసుక సరఫరా అధికార పార్టీ నేతల సూచనల మేరకు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు సాధారణ ఇండ్లు, భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాణదారులు ఇసుక కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గద్వాల జిల్లాకు అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.
అర్ధరాత్రి దందా..
అక్రమ రవాణా దళారులు రాత్రికి రాత్రే భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వారు టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి గద్వాల జిల్లాకు ఇసుకను తరలిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గద్వాల పట్టణంతో పాటు మండల కేంద్రాలు, పల్లెలకు కూడా రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల కళ్లు కప్పి అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అధికారులు వైఫల్యం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అండదండలతోనే ఇసుక రవాణా జరుగుతున్నదని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
Also Read: Directors: ట్రెండ్ మారుతోంది.. దర్శకులే హీరోలుగా!
తప్పుడు పత్రాలతో బురిడీ..
ఒక రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అనుమతులు లేనప్పటికీ, అక్రమార్కులు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. వారు ఏపీలోని సరిహద్దు ప్రాంతాల వరకు ఇసుకను రవాణా చేసేందుకు ఆ ప్రభుత్వానికి సెస్ చెల్లిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణలో తిరిగేందుకు అనుమతులు ఉన్నాయంటూ తప్పుడు బిల్లులు, పత్రాలు చూపిస్తూ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం నిలిచిపోవడం, ఇసుక అక్రమ రవాణా పెరిగిపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Gold Price Today: చిల్డ్రన్స్ డే స్పెషల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
