Directors: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకాలం కథలు, దర్శకత్వం లాంటి తెర వెనుక పనులు చూసుకున్న దర్శకులు.. ఇప్పుడు ఏకంగా తెరపైకి వచ్చి హీరోలుగా నటించేందుకు క్యూ కడుతున్నారు. రచయితలు దర్శకులుగా మారడం, నటులు దర్శకత్వం చేపట్టడం లాంటివి సాధారణంగా జరుగుతూ వస్తున్నాయి. కానీ, దర్శకులే ప్రధాన పాత్రలు పోషించడం అనేది చాలా అరుదుగా జరిగేది. సుదీర్ఘ విరామం తర్వాత, ఈ సరికొత్త ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది. ఈ ‘డైరెక్టర్ టు హీరో’ ట్రెండ్‌కు కోలీవుడ్ నుంచి స్టైలిష్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) శ్రీకారం చుట్టారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) సృష్టించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోకేష్, త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ ఆయన హీరోగా చేస్తున్న చిత్రీకరణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు ఆయన దాదాపు రూ. 35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అనిల్, సుజీత్ కూడా..
ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ జాబితాలో నిలిచేందుకు కొందరు ప్రముఖులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా, ‘ఎఫ్2’ సిరీస్ చిత్రాలు, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి (Anil Ravipudi), ‘సాహో’, ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ (Sujeeth) వంటి యువ దర్శకులు కూడా నటన వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో అనిల్ రావిపూడికి కామెడీ టైమింగ్, సుజీత్‌కు స్టైలిష్ లుక్ ఉండటంతో, వీరు హీరోలుగా మారితే వారి చిత్రాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అంతకుముందు, మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV Vinayak) కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ‘సీనయ్య’ అనే టైటిల్‌తో సినిమా ప్రారంభమైనా, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే, ఆయన మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో రీ-లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
గతంలో రికార్డులు సృష్టించిన ‘దర్శక నటుడు’
నిజానికి, దర్శకులు హీరోలుగా మారడం అనేది సినిమా చరిత్రలో కొత్తేమీ కాదు. దీనికి అత్యంత గొప్ప ఉదాహరణ దర్శకరత్న డా. దాసరి నారాయణరావు (Dasari Narayana Rao). కేవలం దర్శకుడిగానే కాకుండా, ‘స్వర్గం నరకం’ నుంచి ‘ఒసేయ్ రాములమ్మా, మామగారు, మేస్త్రీ’ వంటి పలు చిత్రాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషించి, నటుడిగా కూడా తనదైన ముద్ర వేసి రికార్డులు సృష్టించారు. దాసరి తర్వాత సుదీర్ఘ కాలం గ్యాప్ తీసుకున్న ఈ ట్రెండ్‌ను, ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఆధ్వర్యంలో నేటి తరం దర్శకులు మళ్లీ కొత్తగా ముందుకు తీసుకురాబోతున్నారు. దర్శకులుగా వారికున్న కథా జ్ఞానం, టెక్నికల్ పరిజ్ఞానం నటులుగా వారికి మరింత బలాన్ని చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఈ కొత్త ‘దర్శక హీరోల’ శకం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో చూడాలి!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
