Gadwal Sand Mafia: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఫిల్టర్ ఇసుక దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. ఇసుక మాఫియా చెరువులు, కుంటలు, వాగుల్లో క్వారీలు పెట్టి, మోటార్లతో మట్టిని కడిగి నాణ్యతలేని ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ దందా జోరుగా సాగుతున్నా, అధికారులు, పోలీసులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ దందా సాగుతున్న తీరు..
ఇసుక మాఫియా చెరువులు, కుంటలు, వాగుల్లోని నిలిచిన నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి, మట్టిని, ఇసుకను వేరు చేస్తున్నారు. ఈ విధంగా రోజుకు 4 నుంచి 10 ట్రాక్టర్ల ఇసుకను తయారు చేసి, గద్వాల పట్టణం, ధరూర్ మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. తయారైన ఈ ఇసుకను పొలాల్లో డంపు చేసి, ఆర్డర్‌పై సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన నాణ్యమైన ఇసుక ట్రాక్టర్‌కు రూ. 5,000-రూ. 6,000 అవుతుండగా, అక్రమంగా తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ నాణ్యతలేని ఫిల్టర్ ఇసుకను కూడా అదే ధరలకు వినియోగదారులకు అమ్ముతున్నారు. గద్వాల మండల పరిధిలోని గోనుపాడు గ్రామంలో ఇద్దరు, సంగాల గ్రామ శివారుల్లో ముగ్గురు, ధరూర్ మండలం పార్చర్ల గ్రామ శివారులో, అలాగే గట్టు మండలంలోని చాగదోన శివారులోని చిన్న వాగు, పెద్ద వాగు ఈ దందాకు కేంద్రాలుగా మారాయి.
ప్రకృతి సంపద దోపిడీ..
ధరూర్ మండలం గూడెందొడ్డి రిజర్వాయర్‌లో భాగంగా నిర్మించిన 99 ప్యాకేజీ కాలువ మట్టిని, వాగులోని మట్టితో కలిపి అక్రమార్కులు ఫిల్టర్ చేస్తూ కృత్రిమ ఇసుక దందాకు లేపుతున్నారు. సంగాల రిజర్వాయర్ కింది భాగంలో ఉన్న సంగాల చెరువులో యథేచ్ఛగా ఇసుకను తవ్వుతుండటంతో, ప్రభుత్వ భూమితో పాటు ఇతరుల పట్టా భూమిలో సైతం తవ్వకాలు జరగడంతో ఓ పట్టాదారుడు గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also Read: Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్ ఉత్తర్వులు జారీ
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు..
కుంటలు, వాగుల్లో సంవత్సరాలుగా అక్రమంగా ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్న వారి ఆగడాలను అరికట్టాల్సింది పోయి, సంబంధిత అధికారులు నెలవారీ మామూళ్లకు అలవాటు పడి వారి దందాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ధరూర్, గద్వాల, గట్టు మండలాలో దర్జాగా పట్టపగలే ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఆన్‌లైన్ ఇసుక మాదిరిగా ట్రాక్టర్ పై కవర్ కప్పుకుని తరలిస్తున్నా అధికారులు, పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల సహకారంతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుంగభద్ర ఇసుక నిలిచిపోవడంతో..
జిల్లాలో సమృద్ధిగా ఇసుక వనరులు ఉన్నప్పటికీ, అధికార రాజకీయ నాయకుల డిమాండ్లకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తలొగ్గకపోవడంతో తుంగభద్ర ఇసుక సరఫరా నిలిచింది. ఈ సమస్య మరింత జటిలమవడంతో ఫిల్టర్ ఇసుక తయారీదారులకు ఇది బాగా కలిసొచ్చింది.
గృహ నిర్మాణదారుల ఆందోళన..
నాణ్యతలేని కృత్రిమ ఇసుక వల్ల నిర్మాణంలో నాణ్యత లోపించి ఇంటి పగుళ్లు, లీకేజీలు ఏర్పడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గృహ నిర్మాణదారులు వాపోతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఈ అక్రమ ఇసుక ఫిల్టర్ దందాపై గద్వాల ఎమ్మార్వో మల్లికార్జున్ను వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి రాలేదన్నారు. అయితే, ఆర్ఐ, వీఆర్వోను క్షేత్రస్థాయికి పంపి దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని, మరోసారి అక్రమ ఇసుక దందాకు పాల్పడకుండా కేసులు నమోదు చేయిస్తామని ఆయన తెలిపారు.
Also Read: Medchal News: వివాదంలో శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయం.. నోటీసులు జారీ..!
