Huzurabad: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హుజురాబాద్ (Huzurabad) పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ సాధారణ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. 2026 పురపాలక ఎన్నికలను పురస్కరించుకుని, పట్టణంలోని మొత్తం 30 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల సౌకర్యార్థం పట్టణ వ్యాప్తంగా మొత్తం 60 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ పోలింగ్ బూతుల వారీగా సిద్ధం చేసిన ఓటరు జాబితాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: Huzurabad News: పల్లె ప్రకృతి వనంలో పొంచి ఉన్న మృత్యువు.. హైటెన్షన్ వైర్లతో అల్లుకున్న వనం..!
ఓటర్లు తమ పేర్లను జాబితాలో సరిచూసుకోవాలి
పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని, ఓటర్లు తమ పేర్లను జాబితాలో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టి.పి.ఓ) అభినవ్, టి.పి.ఎస్. ఎన్. అశ్వినీ గాంధీ మరియు పురపాలక కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్డుల విభజన మరియు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ఏవైనా సందేహాలు ఉంటే కార్యాలయంలో సంప్రదించవచ్చని అధికారులు తెలియజేశారు.

