Panchayat Elections: గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాలైన గ్రామాలకు అదనపు నిధులు కేటాయిస్తామని హామీలు ఇచ్చారు, కానీ అవి నీట మూటలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు నగదు ప్రోత్సహాకం ఇస్తామని అధికారికంగా చెప్పకపోయినా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక నాయకులతో చర్చించి అభివృద్ధికి హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్, వార్డు మెంబర్ పదవులను ఏకగ్రీవం చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యే పరిస్థితి లేదు. ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థులను బలపరిచి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని యోచిస్తున్నారు. దీంతో అవగాహన కలిగిన ప్రజలు, గ్రామస్థాయి నేతలు పార్టీలకు అతీతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారు. మూడు విడుతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని గ్రామాలు భారీగా ఏకగ్రీవం అయ్యాయి.
ఏకగ్రీవాలే అధికం
ఈనెల 11, 14, 17వ తేదీలల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏకగ్రీవలపై మొగ్గు చూపారు. మొదటి విడుతలో రంగారెడ్డిలో 174 గ్రామ పంచాయతీల్లో 6 సర్పంచ్‌లు, 90 వార్డులు, వికారాబాద్‌లో 262 గ్రామ పంచాయతీల్లో 39 సర్పంచ్‌లు, 652 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇందులో రంగారెడ్డిలో 5, వికారాబాద్‌లో 37 గ్రామాల పాలకవర్గం పూర్తిస్థాయిలో ఏకగ్రీవం అయ్యాయి. వికారాబాద్జిల్లాలోని తాండూర్ నియోజకవర్గంలోనే 37 గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవం కావడం విశేషం. తాండూర్ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యక్తిగత శ్రద్ధతో ఈ ఏకగ్రీవాలు జరిగాయని తెలుస్తోంది. అదేవిధంగా రెండోవ విడుతలో రంగారెడ్డిలో 13 సర్పంచ్‌లు, వికారాబాద్‌లో 20 సర్పంచ్‌లు, మూడవ విడుతలో రంగారెడ్డిలో 10 సర్పంచ్‌లు, వికారాబాద్‌లో 18 మంది సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండవ విడుతలో 8 గ్రామాలు, మూడవ విడుతలో 6 గ్రామాలు, వికారాబాద్ జిల్లాలో రెండవ విడుతలో 16 గ్రామాలు, మూడో విడుతలో 18 గ్రామాలు పూర్తిస్థాయిలో పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
పోలింగ్‌కు సర్వం సిద్దం
నేడు జరిగే మొదటి విడుత పోలింగ్‌తో పాటు, రెండవ, మూడవ విడుత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడుతలో రంగారెడ్డిలో 168, వికారాబాద్‌లో 225, రెండవ విడుతలో రంగారెడ్డిలో 170, వికరాబాద్‌లో 159, మూడవ విడుతలో రంగారెడ్డిలో 167, వికారాబాద్ 139 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగునున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు సిద్దం చేశారు. పోలింగ్‌సిబ్బంది, పోలింగ్సామాగ్రీ, మైక్రో అబ్జర్వర్, జోనల్ అధికారులు, ఎఫ్ఎస్‌టీలు, ఎస్ఎస్‌టీలు, ఆర్వోలు, మండల స్థాయి పర్యవేక్షక అధికారులు, ఎంసీసీ బృందం, వ్యయ బృందాలు, రవాణా సదుపాయం, వెబ్కాస్టింగ్ఏర్పాట్లు సిద్దం చేశారు. మొదటి విడుత జరిగే పోలింగ్‌కు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు సరఫరా చేయడం జరిగింది.
Also Read: Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత: కమిషనర్ సునీల్ దత్

