Paddy Harvest Delay: పంట పక్వదశకు వచ్చిన ఇనుగుర్తి మండలంలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాలేదు. ఈ ఖరీఫ్ లో 6 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాను, భారీ వర్షాలకు పైరు పడిపోవడం, నీరు నిల్వ ఉండటం ఆలస్యానికి కారణంగా రైతులు చెబుతున్నారు. స్వల్పకాలిక రకాలు వేసిన పొలాల్లో ఈ పాటికే కోతకొయ్యాల్సి ఉంది. సాధారణంగా దీపావళి పండుగ అనంతరం వారం వ్యవధిలోనే ధాన్యం రైతులకు ఇళ్లకు రావడం మొదలవుతుంది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
Also Read: Rohini Acharya: ఎన్నికల్లో ఓటమి వేళ.. లాలూ ఫ్యామిలీతో బంధాన్ని తెంచుకున్న కూతురు.. ఎందుకంటే?
భూమి ఎండితే గాని..
గత మూడేళ్లుగా 90 శాతం కోత పనులను యంత్రాలతోనే చేస్తున్నారు. భూమి ఎండితే గాని వాటిని ఉపయోగించడం కుదరదు. ధాన్యాన్ని బయటకు చేర్చే ట్రాక్టర్లు పొలంలో కూరుకు పోయేంత బురద ఇంకా ఉంది. పంట నేల వాలిన చేలల్లో యంత్రాలతో పనులు చేస్తే ధాన్యం నేల పాలవుతుందని చెబుతున్నారు. కూలీలతో కోత, కట్టేత, కుప్పవేత పనులకు ఖర్చులు పెరగడమే కాకుండా పంట చేతికి రావడానికి నెల రోజులు పడుతుంది. దీంతో కర్షకులు ఎటు పాలు పోనీ పరిస్థితిలో ఉన్నారు.
మరోవైపు నేలబారిన పంట పొలాల విస్తీర్ణాన్ని వ్యవసాయ అధికారులు వివరాల నమోదు, ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేశారు. వాతావరణం ఇలాగే అనుకూలంగా ఉంటే కోత నూర్పిడి పనులు అయిదారు రోజుల్లో ఊపందుకునే అవకాశం ఉందని కర్షకులు ఆశిస్తున్నారు.
Also Read: Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!
