Bhuvanagiri Fort: తెలంగాణలోనే అతిపెద్ద రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో తొలిరోప్ వే కూడా భువనగిరి గుట్టదే. పర్యాటక శాఖ తీసుకుంటున్న చర్యలతో వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ రోప్ వే తో గంటలు 400మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది. టూరిజంశాఖ 3 నెలలు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. మరో మూడునాలుగు రోజుల్లో సివిల్ వర్క్స్ టెండర్లు పిలువనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తీసుకుంటున్న చొరవతో వేగంగా రోప్ వే పనులు వేగంపుంజుకున్నాయి.
భువనగిరి కోటపై రోప్‌వే
రాష్ట్రంలో తొలిసారిగా రోప్‌వేను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ చర్యలు తీసుకుంటుంది. పర్యాటకులకు పర్యాటక అనుభూతిని పంచేందుకు భువనగిరి కోటపై రోప్ వే ఏర్పాటుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందుకు సంబంధించిన ప్లాన్ ను రూపొందించింది. ఇప్పటికే రోప్ వే పనులు ప్రారంభం అయ్యాయి. సంబంధిత పనులను కోల్ కత్తా, వెస్ట్ బెంగాల్ కు చెందిన కంపెనీలు చేపడుతున్నారు. ఆ పనులను రాష్ట్ర పర్యాటకశాఖ నిత్యం మానిటరింగ్ చేస్తుంది. మూడు, నాలుగు రోజుల్లో సివిల్ వర్క్స్‌కు సంబంధించిన టెండర్ల పిలుపువనున్నారు. ఫైనల్ కాగానే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 900మీటర్ల దూరం రోప్‌వే ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోనే ఫస్ట్రోప్వే కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం భువనగిరికోటకు రూ. 84 కోట్లు కేటాయించింది. మొత్తం నాలుగు విడతల్లో నిధులు మంజూరు చేయనుండగా.. తొలి విడతలో రూ.56 కోట్లు రిలీజ్ చేసింది. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించగా.. ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది.
భువనగిరి ఖిల్లాతో పాటు ఖమ్మం నగరంలోని ఖమ్మం ఖిల్లా వద్ద 300 మీటర్ల రోప్ వే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, అదికూడా ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రోప్ వేలపై ప్రత్యేక దృష్టిసారించింది. నిత్యం యాదగిరిగుట్టకు వేలల్లో భక్తులు వస్తుండటం, స్వర్ణగిరి టెంపుల్ కు సైతం భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వారిని సైతం కోటకు వచ్చేలా ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రచారం సైతం చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్లాన్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Anganwadi Jobs: త్వరలోనే అంగన్వాడీల్లో.. 14వేల ఖాళీలు భర్తీ!
తెలంగాణన టూరిస్టు హబ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టూరిజంకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. తెలంగాణను టూరిస్టు హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు చేపడుతున్నది. హైదరాబాద్ నగరానికి 50 కీలోమీటర్ల సమీపంలో ఉన్న భువనగిరి కోట వద్ద రోప్‌వే ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే భువనగిరి కోట వద్ద రోప్ వే కోసం 32 మంది రైతుల నుంచి ఎకరం రెండు గుంటల భూమి సేకరించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం రైతుల నుంచి సేకరించిన భూమికి రూ.98 లక్షలు చెల్లించారు. కోటపై 3 ఎకరాల విస్తీర్ణంలో రెస్టారెంట్, కన్వేన్షన్ హాలు, రెస్టారెంట్, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. శుభకార్యాలయాలు సైతం ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా కోటపై కొలనులు ఉండటతో హెరిటేజ్ కు ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిష్ణాతులపైన కంపెనీలకే పనులు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.10.37 కోట్లతో కోట ప్రవేశద్వారం
మెుత్తం రూ.15.20 కోట్ల వ్యయంతో రోప్ వే నిర్మించనుండగా 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డు, పార్కింగ్ నిర్మించనున్నారు. వీటికి రూ.10.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో రూ.10.37 కోట్లతో కోట ప్రవేశద్వారం, టూరిజం సదుపాయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. కోటలోని నీటి కొలను, ప్రాకారాలు, రాజ ప్రసాదాలు వంటి చారిత్రక నిర్మాణాలను రూ.9.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. బర్త్ డేలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాక్ ఫాండ్స్, రాక్టేబుల్స్సుందరీకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ కు చెందినవారు కన్వేయర్ రోప్ వే, రోప్ వే పనులు చేస్తున్నారు. రాష్ట్రంలో అద్భుత టూరిస్టు ప్లేస్‌గా భువనగిరి కోట నిలవనుంది.
భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర
తెలంగాణలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కోటలు. ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. హైదరాబాద్‌కు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి కోట దాదాపు 3 వేల ఏండ్ల చరిత్ర ఉంది. 610 మీటర్ల ఎత్తైన కొండపై ఉన్న కోటను చేరుకోవడానికి సుమారు గంట వరకు సమయం పడుతుంది. ఈ కోటలో రహస్య సొరంగాలు, గుహలు, కాళికా మాత ఆలయం, ఫిరంగులు వంటి చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ కోట నుంచి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న కాపురాల గుట్టకు కింది నుంచి రహస్య సొరంగం ఉందని నానాడు. యుద్ధ సమయంలో సైనికులు ఈ మార్గం నుంచి వెళ్లేవారని చరిత్ర పేర్కొంటుంది. ఈ కోట ట్రెక్కింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. కోటకు సమీపంలో ఒక వైపు యాదగిరిగుట్ట, మరోవైపు స్వర్ణగిరి ఆలయాలు ఉన్నాయి.
గంటకు 400 మంది పర్యాటకులు
చిన్న రోప్‌వేపై ఒకేసారి 4– 8 మంది, పెద్ద డిటాచబుల్గోండోలాలు లేదా ట్రామ్ వేలపై 12 నుంచి 14 మంది ప్రయాణించవచ్చు. క్యాబిన్సైజు, వేగం, క్యాబిన్ల సంఖ్య ఆధారంగా గంటకు 400 మంది పర్యాటకులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఈ రోప్ వేలు ఉక్కు తాడు (కేబుల్) మీద నడిచే క్యాబిన్‌ల ద్వారా పనిచేస్తాయి. ఇవీ ఎలక్ట్రిక్ మోటార్‌తో డ్రైవ్ స్టేషన్ ద్వారా కదులుతుంటాయి. క్యాబిన్‌లు రోప్‌కు స్థిరంగా లేదా డిటాచబుల్ గ్రిప్‌తో అమర్చుతారు. టెర్మినల్స్‌లో పర్యాటకులు ఎక్కి, దిగుతారు. ఆధునిక రోప్‌వేలు సెన్సార్లు, ఆటోమేటెడ్ కంట్రోల్ సిస్టమ్స్‌తో సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే, ఈ రోప్‌వే పూర్తయిన తర్వాత ప్రభుత్వమే మూడు నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నది. దీని ద్వారా సాంకేతిక అంశాలను పరీక్షించి అందుబాటులోకి తీసుకురానున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రోప్ వే ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సీఎం సహకారంతో ముందుకెళ్తున్నాం- మంత్రి జూపల్లి
తెలంగాణను టూరిజం హబ్ గా చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం లక్ష్యం. సీఎం సహాయసహకారాలతో భువనగిరి కోట వద్ద రోప్ వే ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోనే మొదటి రోప్ వే. టూరిజం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నా. అధికారులు సైతం పూర్తి సహకారం అందజేస్తున్నారు. నిత్యం పనుల పర్యవేక్షణ చేస్తున్నాం, ఏడాదిలోగా పర్యటకులకు రోప్ వేను అందుబాటులోకి తీసుకురానున్నాం. రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం. అందులో భాగంగానే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి 22 ప్రాంతాలను పోటీల్లోనే పాల్గొనేందుకు వచ్చిన 108 దేశాల వారికీ చూపించాం. దీంతో తెలంగాణ టూరిజాన్ని విస్తృత ప్రచారం చేశాం. దేశంలోనే గొప్ప టూరిజం ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం.
Also Read: Madhu Yashki Goud: జైలుకు వెళ్లనున్న కేసీఆర్, హరీష్.. మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు