Gadwal District: ఎవరూ ఏమీ అనకపోతే రోడ్డు మీద కూడా ఇళ్లు కట్టేలా ఉన్నారు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొంతమంది. గజం జాగా అదనంగా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే అది రోడ్డు అయినా సరే ఆక్రమించి నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. మరికొంతమంది అయితే అవకాశం ఉంది కదా, ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తలేవు కదా.. అధికారులు కూడా ఏమి అనట్లేదు కదా అని రోడ్డు సగం వరకు ర్యాంపులు ఏర్పాటు చేసుకొని తమ ఇంటిని పొడిగించుకొని నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా రోడ్డును ఆక్రమించి ర్యాంపులు ఏర్పాటు చేసుకున్న వారిపై గద్వాల మునిసిపల్(Gadwal Municipality) అధికారులకు ఫిర్యాదులు చేస్తే ఆయా గృహ నిర్మాణాదారులు తమపై గొడవ చేస్తారన్న భయంతో స్థానిక వీధి వాసులే కొంతమంది ఉండగా, పోయేది నా జాగా కాదు కదా నాకేందుకు లే అని చూస్తూ వెళ్తున్న వారు మరికొంతమంది. ఫలితంగా రోడ్డు ఇరుకుగా మారుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఇరుకుగా మారుతున్న రోడ్లు..
గద్వాల పట్టణంలో భీంనగర్ రోడ్డు(Bhimnagar Road) నుంచి రెవెన్యూ కాలనీ, పోలీస్ క్వార్టర్స్ కు వెళ్లే రోడ్డును కొంతమంది ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక్క ఈ వీధులే కాదు ఇంటి నిర్మాణాలు చేపడుతున్న ప్రతిచోట ఇదే పరిస్థితి ఉంది.రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహ నిర్మాణదారులు రోడ్డు సగం వరకు ఆక్రమించి ర్యాంపులు (మెట్లు) నిర్మిస్తున్నారు. ఫలితంగా వీధులు ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెట్ బ్యాక్ లేకుండా ర్యాంపు ఉన్న ఇంటిని దాటి కారు లాంటి వాహనం వెళ్లాలంటే అతి కష్టం మీద వెళ్లాల్సిన పరిస్థితి. ఒక్కోసారి కొన్ని వీధుల్లో ద్విచక్ర వాహనదారులు పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై స్థానిక ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు చూస్తున్నా తమ ఓటు బ్యాంకు కోసం మిన్నకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read: DGP Shivdhar Reddy: తెలంగాణ బందును శాంతియుతంగా జరపాలని డీజీపీ ఆదేశం
అక్రమ నిర్మాణాలు
ఇకపోతే మునిసిపల్ వార్డు అధికారుల అలసత్వం కూడా ఉన్నట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఏదిఏమైనా రోడ్డు, మునిసిపల్ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యంగానే ఇలాంటి ఆక్రమణలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలకు జరిగినట్లు రుజువైతే సుమోటోగా తీసుకొని అక్రమ నిర్మాణాలను తొలిగించాలని కోరుతున్నారు. అంతేగాక ఇంటికి తగ్గట్లు లగ్జరీ కార్ లు కొనుగోలు చేస్తున్నా అందుకు తగ్గట్లు సెట్ బ్యాక్ చేసుకొని పార్కింగ్ చేసుకోకపోవడం వల్ల, అప్పటికే రోడ్ స్థలం కొన్ని ఫీట్లు ఆక్రమించుకొని చెట్ల మొక్కలు నాటుకోగా, మిగిలిన సగం స్థలంలో పార్కింగ్ కోసం ఏకంగా కొందరు షెడ్లని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు క్రాస్ కాకపోవడంతో ఒకరు సైడ్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. అలాంటి నిర్మాణాలను తమ దృష్టికి వస్తే తొలగిస్తామని జానకీరామ్ సాగర్ మున్సిపల్ కమిషనర్ అన్నారు.
Also Read: Telangana Govt: ఇందిరమ్మ ఇళ్లకు ‘ఉపాధి కూలీలు’.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
