*రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం
*ప్రతి ఇంటి నిర్మాణంలో 90 రోజులపాటు పనులు
*అనుమతి ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ
*ఉపాధి కూలీకి రోజుకు రూ.307 వేతనం
*90 రోజులకు రూ.27,630 వరకు ప్రయోజనం
*బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు
*స్లాబ్ నిర్మాణం వరకు 50 పని దినాలు
*నిబంధనల మేరకు పనిచేసే అవకాశం
*రెండు విడుతల్లో 21261 మంది లబ్ధిదారులు
Telangana Govt: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉపాధి హామీ కూలీలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ సైతం అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు భారీ ఊరట లభించినట్లు అయింది. ఈ ఏడాది ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం బాసటగా నిలిచినట్లయింది. లబ్ధిదారులకు మేలు జరుగడమే కాకుండా కూలీలకు సైతం గ్రామంలోనే పనులు లభించనున్నాయి. ఇళ్ల నిర్మాణ పనులు సైతం వేగవంతం కానున్నాయి.
Also Read- Jubilee Hills By Election: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నవంబర్ 11న గవర్నమెంట్ హలీడే.. ఎందుకో తెలుసా..!
ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల్లోని పేదలకు సొంతింటికల నెర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగానే నియోజకవర్గానికి 2500 ఇళ్ల నిర్మాణం చేపడ్తామని పేర్కొంది. అందులో భాగంగానే తొలి విడుతలో 9819 లబ్ధిదారులను గుర్తించింది. రెండో విడుతలో 11442 మందిని గుర్తించి వారు ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు విడుతల్లో కలిపి 21261 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. ఒక్కో లబ్దిదారుడికి రూ.5 లక్షలు ఆర్థికసాయం అందజేస్తుంది. అయితే ఇంటి నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సాయం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరం అయ్యే ఇసుకను ఉచితంగా అందజేస్తుంది. మరోవైపు పేదలను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది.
Also Read- Tollywood Box Office: నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. బాక్సాఫీస్ వద్ద సందడేది? వీక్ ఓపెనింగ్స్!
ఉపాధి హామీ జాబ్ కార్డు
ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నిర్మాణంలో ఉపాధిహామీ పథకం కింద 90 రోజులు పనులు కల్పిస్తున్నారు. లబ్ధిదారులు కూలీల కొరత, అధిక వ్యయాలు, ఇతర ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధి కూలీకి ప్రతీ రోజుకు రూ. 307 వేతనం ఇస్తున్నారు. 90 రోజులకు గాను వారికి రూ. 27,630 వరకు ప్రయోజనం కలగనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ వరకు 50 పని దినాలను నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చు. అధికారులు ఇందిరమ్మ ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వారిని గుర్తిస్తారు. వారి జాబితాను తయారు చేసి. దాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులకు పంపిస్తారు. వారు ఈ జాబితాలోని లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తూ పని దినాలు కల్పించనున్నారు. అలాగే ఆ జాబితాను గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపించాలి. ఉపాధి హామీ ఇందిరమ్మ ఇళ్లను అనుసంధానం తర్వాత నిర్మాణ పనులు పూర్తి కాకుండా మిగతా పనులు జరపొద్దని పంచాయతీరాజ్ శాఖ సూచించింది.
ఫొటోతో సహా అప్లోడ్ చేయాలి
మరోవైపు ఇంటి నిర్మాణంపై మూడు స్థాయిల్లో పనుల ఫొటోలను, లబ్ధిదారుల ఫొటోతో సహా అప్లోడ్ చేయాలి. ఆ పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తూ చెల్లింపులకు అనుమతించాలి. ఈ చెల్లింపులకు సంబంధించి వివరాలను గ్రామ కార్యదర్శి అందరికీ తెలిసే విధంగా పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి. ఈ లబ్ధిదారుల జాబితాతో ఒక రిజిస్టర్ తయారు చేసి సామాజిక తనిఖీల సందర్భంగా అందజేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇందిరమ్మ లబ్దిదారులకు భారీ ఊరట కలిగించినట్లు అయింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
