Tollywood Box Office: సెప్టెంబర్ నెలలో వచ్చిన సినిమాలలో ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts), ‘మిరాయ్’ (Mirai), ‘ఓజీ’ (OG), ‘కిష్కంధపురి’ (Kishkindhapuri) సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. థియేటర్లకు రావడం లేదనుకున్న ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాలకు పెద్ద విజయం అందించారు. తర్వాత అక్టోబర్‌లో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రాన్ని కూడా బాగానే ఆదరించారు. ఇలా వరసబెట్టి సినిమాలు చూసి చూసి.. అలసిపోయినట్లున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ వారం విడుదలైన నాలుగు చిత్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ‘మిత్రమండలి’ (Mithra Mandali), ‘డ్యూడ్’ (Dude), ‘తెలుసు కదా’ (Telusu Kada), ‘కె-ర్యాంప్’ (K Ramp) చిత్రాలు విడుదలైనప్పటికీ (కె ర్యాంప్ అక్టోబర్ 18న విడుదల కానుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్నంతగా లేవు), వీటికి కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా, పండుగ సీజన్ అంటే బాక్సాఫీస్ సందడిగా ఉంటుంది. పెద్ద సినిమాలే కాకుండా, చిన్న చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కానీ, ఈ వారం విడుదలైన అన్ని సినిమాలకు ఓపెనింగ్ చాలా వీక్‌గా ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఖాళీగానే థియేటర్లు
దీపావళి స్పెషల్‌గా వచ్చిన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద అసలు సందడే లేదు. ఉదయం షోల నుంచి సాయంత్రం షోల వరకు చాలా థియేటర్లు ఖాళీగానే కనిపించాయి. ముఖ్యంగా, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాపై ప్రేక్షకులకు కొంత ఆసక్తి ఉన్నా, ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అలాగే, మిగతా మూడు చిత్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ వీక్ ఓపెనింగ్స్ ఇంత బలహీనంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రేక్షకులు దీపావళి సెలబ్రేషన్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టడం అయి ఉండవచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా, వరుసగా పండుగ సెలవులు రావడంతో, కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండటం లేదా సొంతూళ్లకు వెళ్లడంపై ఎక్కువ మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
Also Read- Jatadhara Trailer: ధన పిశాచిగా సోనాక్షి విశ్వరూపం.. ట్రైలర్ ఎండింగ్ అస్సలు మిస్సవ్వకండి!
హెచ్చరిక అని అనుకోవచ్చా..
ఇంకా, గత కొన్ని వారాలుగా వరుసగా భారీ చిత్రాలను చూసిన ప్రేక్షకులు, ఈ వారం విడుదలైన సినిమాలపై అప్పటి స్థాయిలో ఆసక్తి చూపలేదన్న వాదన కూడా ఉంది. ఒక విధంగా, అంతకుముందు చిత్రాల విజయం ఈ సినిమాలపై ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. దీపావళికి క్రాకర్స్ కొనే ఖర్చును దృష్టిలో పెట్టుకుని, సినిమాల గురించి అంతగా పట్టించుకోకపోయి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద, దీపావళి లాంటి పెద్ద పండుగ రోజున నాలుగు సినిమాలు విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద సందడి లేకపోవడం టాలీవుడ్‌కు ఒక హెచ్చరికగానే భావించాలి. సినిమాల కంటెంట్ బలంగా ఉంటేనే, పండుగ సెలవుల్లో అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఈ వారం ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఈ వీక్ ఓపెనింగ్స్ చాలా వీక్‌గా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో అయినా సినిమాలు పుంజుకుంటాయో, లేదో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
