Gadwal district Rains: బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో ఎడతెరిపిలేని ముసురు వర్షం కురుస్తోంది. పలు మండలాలలోని గ్రామాల రహదారుల వంతెనలపై నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అధిక వర్షాలతో వ్యవసాయ పనులు జరగక రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు నెలలుగా జిల్లాలో వర్షాలు లేక పంటల సాగుకు నీరు లేక ఇబ్బందులు పడిన రైతులు ప్రస్తుతం గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పంటలకు కలుపులు పెరిగి,తెగులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేయగా ప్రస్తుతం పూత,కాయ దశలో ఉండగా అధిక వర్షాలకు కాయలు కుళ్ళిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది.
నేడు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జిల్లా విద్యాశాఖ పలు మండలాకు సెలవు ప్రకటించింది. వడ్డేపల్లి ఆలంపూర్ ఎర్రవల్లి ఐజ, ఇటిక్యాల, మానపాడు మండలాలలో వర్షాల తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
మానవపాడు మండల కేంద్రానికి సమీపంలోని పెద వాగు మరోసారి కురుస్తున్న వర్షాలకు రహదారిపై భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. సమీపంలోని చెన్ని పాడుకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ఐజ మండలం ఉత్తనూర్ గ్రామంలో సైతం రహదారి పై నీటి ప్రవాహం ఉండడంతో ట్రాక్టర్ సహాయంతో కొందరు ప్రజలను అవతలి ఒడ్డుకు చేర్చాల్సిన పరిస్థితి దాపురించింది. ఐజ నుంచి మంత్రాలయం వెళ్లే పోలోని వాగు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు మరోసారి తెగిపోయింది.
దీంతో ఉత్తనూరు మీదుగా ఐజకు రాకపోకలు కొనసాగుతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జి ల కింద నీరు నిల్వ ఉండి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్ని రోజులు వర్ష సూచన ఉండడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే కురుస్తున్న చెదురు ముదురు వర్షాలతో గ్రామీణ ప్రాంతాలలోని రోడ్లు చిత్తడితో ఇబ్బందుల్లో తలెత్తుతున్నాయని, నీరు నిల్వ ఉండడంతో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు దోమల వ్యాప్తి వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పాలకులు పరిష్కరించకపోవడంతోనే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహానదారులు వాపోతున్నారు.
మట్టితోనే మరమ్మతులు
జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వర్షం వచ్చినప్పుడల్లా రోడ్లు గుంతల మయంగా మారి వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్, మేళ్లచెరువు రోడ్, కృష్ణవేణి చౌక్, ఐజ రోడ్డు,ఫ్లై ఓవర్ పై గోతులు ఏర్పడ్డాయి. రోడ్లు మరమ్మత్తులు చేయకపోవడంతో అధికారుల తీరుపై పట్టణ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చేసుకున్నాయి. దీనిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా ఆర్ అండ్ బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా మట్టితో రోడ్లపై ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చి చేతులు దులుపుకుంటున్నారే కానీ పూర్తిస్థాయిలో రోడ్ల మరమ్మత్తు నోచుకోవడం లేదని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ
జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కరెంట్ స్తంభాలు,ఇనుప వస్తువులు, ట్రాన్స్ ఫార్మర్ల సమీపంలోకి వెళ్ళవద్దని, నీటి ప్రవాహం ఉన్నచోట ఇప్పటికే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.
Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు