Gaddiannaram Fruit Market: దేశంలోనే అతిపెద్దదైన గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు నగర శివారులో ఉన్న ఈ మార్కెట్, ఇప్పుడు ప్రధాన పట్టణంలో భాగం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో గత ప్రభుత్వం కొహెడ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఏర్పాటుకు భూమి కేటాయించింది. ఈ క్రమంలో దిల్సుఖ్నగర్సమీపంలోని గడ్డిఅన్నారంలో ఉన్న మార్కెట్‌ను 2021 అక్టోబర్‌లో బాటసింగారం ప్రాంతానికి తరలించారు. తాత్కాలికంగా బాటసింగారం వద్ద అద్దె ప్రాతిపదికన షెడ్లు నిర్మించి వ్యాపారాన్ని తరలించారు. అయితే, తుపాను గాలులకు ఆ తాత్కాలిక షెడ్లు కూలిపోవడంతో వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ సర్వే నిర్వహించి, రూ. 2,901 కోట్లతో ‘గ్లోబల్ గ్రీన్ మార్కెట్’ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి.
Also Read: Koheda Fruit Market: అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ ఫ్రూట్ మార్కెట్.. త్వరలో ప్రారంభం..!
అద్దెలకే రూ. 25 కోట్లు వృథా
మార్కెట్ తరలింపు నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం అద్దెల కోసమే సుమారు రూ. 25 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ప్రస్తుతం నెలకు రూ. 70 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మార్కెట్ ఖజానాలో రూ. 314 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ, వాటిని వినియోగించి శాశ్వత భవనాలు నిర్మించడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం బాటసింగారంలో కేవలం ఖాళీ స్థలానికే అద్దె కడుతూ, షెడ్లను మాత్రం మార్కెట్ నిధులతోనే నిర్మించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్దెకు పోతున్న ఈ భారీ సొమ్ముతో ఇప్పటికే 60 శాతం శాశ్వత నిర్మాణాలను పూర్తి చేసే వీలుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడ హైవేపై వస్తున్న వాహనాలు మార్కెట్లోకి వెళ్లడానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ప్రజాప్రతినిధుల అనాసక్తి?
కొహెడలో అంతర్జాతీయ హంగులతో మార్కెట్ నిర్మిస్తే స్థానిక భూముల ధరలు పెరగవని, ఒక పారిశ్రామికవేత్త ప్రయోజనాల కోసం ఒక ప్రజాప్రతినిధి అడ్డుపడుతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నా, స్థానిక రాజకీయ సమీకరణాల వల్ల అడుగు ముందుకు పడటం లేదని తెలుస్తోంది. ఆఖరికి తాత్కలిక నిర్మాణం చేసేందుకు కూడా ఆ ప్రజాప్రతినిధి సహకరించట్లేదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మార్కెట్ నిర్మాణంలో స్పీడ్ పెంచకపోవడంతో వివిధ అనుమానాలకు తావునిస్తోంది. ప్రభుత్వం కూడా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల ఆసక్తిని బట్టే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అవుతుందని ఆశించిన కొహెడ ప్రాజెక్టు, ఎప్పటికి పూర్తవుతుందో.. లేక మరో ప్రాంతానికి తరలిపోతుందో అని రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Batasingaram Fruit Market: మార్కెట్‌కు పోటెత్తిన మామిడి.. ఈ సారి మార్కెట్‌కి కాసుల పంటే!

