Narsa Reddy Slams KCR: అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా, గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో లేకుండా, నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మాజీ సీఎం కేసిఆర్ గజ్వేల్ తో పాటు రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉండగా గజ్వేల్ లో ప్రారంభించిన అసంపూర్తి పనులన్నింటిని పూర్తి చేయవలసిన బాధ్యత కేసిఆర్ దేనిని పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు రెడ్ కార్పెట్ పరిచి పూలు చల్లి నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ గజ్వేల్ శాసనసభ్యునిగా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకునిగా బాధ్యతలు నిర్వహించవలసి ఉన్నప్పటికీ ఫామ్ హౌస్ కే పరిమితమైతున్నారని ఆరోపించారు. ఇటీవల కేసిఆర్ అసెంబ్లీకి వెళ్లి రాష్ట్ర, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చ జరపడానికి సమయం కేటాయిస్తారని భావించినప్పటికీ ఐదంటే ఐదు నిమిషాలు అసెంబ్లీలో ఉండి ఆ తర్వాత బయటకు రావడం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా రాష్ట్ర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి తన అనుభవాలతో సలహాలు, సూచనలు చేయవలసిన కేసిఆర్ అవేవీ పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవడం తెలంగాణకు నష్టం చేసిన వారే అవతారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసిఆర్ ను పిలిచినప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాల హాజరును పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించడానికి ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు.
Also Read: KCR: స్థానికంపై దృష్టి సారించండి.. గెలుపోటములు సహజం..కేటీఆర్‌ను అభినందించిన కేసీఆర్
గజ్వేల్ లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
గజ్వేల్ లో స్థానిక ఎమ్మెల్యేగా పెండింగ్ పనులను పూర్తి చేయవలసిన బాధ్యత కేసిఆర్ దేనని నర్సారెడ్డి గుర్తు చేశారు. గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేగా పదింటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తే ఎనిమిది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కొండపోచమ్మ, సాగర్ మల్లన్న సాగర్ నిర్మాణం కోసం ముంపు గ్రామాల ప్రజలు త్యాగం చేశారని వారిని పట్టించుకోకుండా పోవడం దురదృష్టకరమన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణం పూర్తిగా జరగలేదని ప్యాకేజీ లందరికీ వర్తింప చేయలేదని ఇంకా అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రికి ఉన్న హోదా ఉంటుందని బడ్జెట్ కేటాయింపు కూడా ఉంటుందని గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేయాలని కోరారు.
కేసీఆర్ గజ్వేల్ కోసం పనిచేయాలి
గతంలో కేసీఆర్ గజ్వేల్ కోసం పనిచేయాలని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చామని, గవర్నర్ వద్దకు పాదయాత్రగా వెళ్లి కలిశామని వివరించారు. ఇప్పటికైనా కేసీఆర్ గజ్వేల్ ప్రజల బాగుకోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అసెంబ్లీకి హాజరుకావాలని స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఇది తమ నిరసన కాదని విజ్ఞప్తిగా గుర్తించాలని నర్సారెడ్డి పేర్కొన్నారు. కాగా కేసిఆర్ పిఎ వచ్చి తమను కలిసి కేసిఆర్ తో త్వరలో కలిసే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిందని దానికోసం కూడా వేచి చూస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

