KCR: తెలంగాణ రాజకీయ యవనికపై దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం చలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పలకరించిన వరుస పరాజయాలతో పార్టీ గ్రాఫ్ పడిపోవడం గులాబీ శ్రేణులను కలవరపెడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్(KTR) ఫెయిల్ అయ్యారనే వాదనపై జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో పార్టీలో నాయకత్వ పగ్గాలపై నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టు సమాచారం.
హరీశ్ రావుకు పార్టీ పగ్గాలు
పార్టీ వరుస ఓటముల నేపథ్యంలో ఈసారి హరీశ్ రావుకు బాధ్యతలు ఇచ్చి పార్టీని గాడిలో పెట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని ఓ వర్గం నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. దీన్ని పసిగట్టిన కేసీఆర్ పార్టీ ప్రక్షాళన, యువతకు అవకాశాల పేరుతో హరీశ్ రావుకు దగ్గరగా ఉండే సీనియర్లను పక్కన పెట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. సంక్రాంతి తరువాత పార్టీలో అధినేత కేసీఆర్(KCR) చేపట్టబోతున్న మార్పులపై ఇప్పుడు బీఆర్ఎస్‌లో జోరుగా చర్చ నడుస్తున్నది.
వైఫల్యాలతో మసకబారిన కేటీఆర్ ఇమేజ్!
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ వరుస పరాజయాలను మూటగట్టుకోవడం ఇప్పుడు ఆయన సామర్థ్యాలపైనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీకి పార్టీ అభ్యర్థులు దొరక్కపోవడం, కంటోన్మెంట్-జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి కేటీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. ఈ పరిణామాలు కేటీఆర్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో మెజార్టీ పంచాయతీలను కూడా గెలిపించుకోలేకపోవడం కేటీఆర్‌కు పెద్ద మైనస్‌గా పరిణమించింది. కేటీఆర్ కేవలం హైటెక్ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చి, క్షేత్రస్థాయి కార్యకర్తలను విస్మరించారనే విమర్శ సీనియర్ల నుంచి బలంగా వినిపిస్తున్నది. మరోవైపు, అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధిపేటలో హరీశ్ రావు సత్తాచాటుతున్నారని, ఆయనకు ఒక్కసారైనా పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు పార్టీలో వినిపిస్తున్నాయి.
Also Read: Telangana Panchayats: గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
యువతకు ఛాన్స్.. అసలు వ్యూహం అదేనా?
హరీశ్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నడుస్తున్న చర్చను కేసీఆర్ పసిగట్టినట్టు సమాచారం. దీంతో హరీశ్ రావుకు దగ్గరగా ఉండే సీనియర్లను పక్కకు తప్పించాలని వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. హరీశ్ రావు వర్గాన్ని నిలువరించి కేటీఆర్ వైపు నిలిచే నాయకత్వాన్ని తయారు చేసే పనిలో కేసీఆర్ ఉన్నట్టు చర్చ నడుస్తున్నది. అందులో భాగంగానే సంక్రాంతి తర్వాత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల మార్పునకు గులాబీ బాస్ శ్రీకారం చుట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.
టార్గెట్ హరీశ్ రావు?
యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే నెపంతో హరీశ్ రావుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలను పక్కన పెట్టడం ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా వచ్చే యువ నేతలు సహజంగానే కేటీఆర్ ఆలోచనా విధానంతో నడిచేలా చూసుకోవడం ద్వారా, పార్టీపై ఆయన పట్టును మళ్లీ పెంచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. సీనియర్ల అసమ్మతి బహిర్గతం కాకుండా వారిని వయోభారం నెపంతో పక్కకుతప్పించి, పార్టీని పూర్తిగా కేటీఆర్ కంట్రోల్‌లోకి తీసుకురావడమే ఈ పునర్వ్యవస్థీకరణ అసలు లక్ష్యమని భావిస్తున్నారు. తర్వలో జరగబోయే బీఆర్ఎస్ నియోజకవర్గాలు, జిల్లా అధ్యక్షుల మార్పు హరీశ్ రావు టార్గెట్‌గా జరగనుందనే చర్చ జోరుగా సాగుతున్నది.
Also Read: Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్ సీరియస్.. చర్యలు తప్పవ్!

