Etela Rajender: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన, పంట చేతికొచ్చినా కాంటాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడం, మిల్లుల్లో రోజుల తరబడి అన్నదాతలను ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 8 కేజీల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకోవడం దుర్మార్గం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సన్న వడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్, రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే ప్రతి రైతుకూ చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు.
10 వేల పరిహారాన్ని వెంటనే అందించాలి
వర్షాలు, తుఫానుల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారాన్ని వెంటనే అందించాలని కోరారు. అలాగే, పత్తి సేకరణను ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టాలని, సీసీఐ సంస్థ 7 క్వింటాల్ నిబంధనను సడలించి కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలబడుతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు గెలిచే సత్తా తమకే ఉందన్నారు. ‘మా అభ్యర్థులను గెలిపిస్తే, పనులు చేయించే బాధ్యత నాది’ అని హుజూరాబాద్ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.
Also Read: Etela Rajender: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది : ఎంపీ ఈటల రాజేందర్
