Huzurabad Floods: అధికారుల నిర్లక్ష్యం, అక్రమ భూ కబ్జాల కారణంగానే హుజూరాబాద్(Huzurabad)లో వరదలకు పలు కాలనీలు మునిగిపోయాయని బీఆర్‌ఎస్(BRS) సీనియర్ నాయకుడు, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ ఆరోపించారు. కబ్జాలపై అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లోని కొందరు రియల్ వ్యాపారులు చెరువులు, వాగులు, గొలుసుకట్టు కాలువలను కబ్జా చేస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు.
Also Read: New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ
నామమాత్రపు సర్వేలు
ఈ కబ్జాలపై ఫిర్యాదు చేసినా, అధికారులు కేవలం నామమాత్రపు సర్వేలు చేసి వదిలేస్తున్నారని ఆయన అన్నారు. నీటి వనరుల పక్కన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి (NOC) తప్పనిసరి అయినప్పటికీ, మున్సిపాలిటీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక కుమ్మక్కు జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ జరిపించాలని సమ్మయ్య డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన కాలువలు, చెరువులు, వాగులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
హుజూరాబాద్‌కు ఇప్పుడు హైడ్రా (అక్రమ నిర్మాణాల కూల్చివేత) అవసరం అని అభిప్రాయపడిన సమ్మయ్య, కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి హైడ్రాను ఏర్పాటు చేసి కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో వరదల ముప్పు లేకుండా కబ్జాకు గురైన గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరించాలని, చెరువులు, కుంటలు, వాగులకు హద్దులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Also Read: Crime News: పట్టపగలే శంకర్ పల్లిలో దారి దోపిడీ.. మధ్యలో కారు ప్రమాదం.. చివరికి..?