Khammam: గణాలకు అధిపతి అయిన వినాయకుడు జన్మించిన సందర్భంగా 9 రోజుల పాటు జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపాలలో కొలువుతీరిన గణనాధులకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా తమ పిల్లలకు మంచి విద్యాభ్యాసం సమకూరాలని కోరుతూ మేకల తండా బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ కనకదుర్గ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గ్రామాల్లో పోటీలు పడి ప్రతి వార్డులోను కూడా మండపాలు ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించారు. ప్రధమంగా విఘ్నేశ్వరుని పూజించడం వల్ల తాము చేయబోయే పనులలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు.
Also Read: Ganesh Chaturthi: మానుకోట ఖమ్మం జిల్లాలో ఘనంగా గణనాథుల ఉత్సవాలు!
మండపాల్లో వినాయకుడిని కొలువు దీర్చి,ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తర్వాత,ఎంతో ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తుంటారు. మండలంలోని గేటు కారేపల్లి, మేకల తండా, దుబ్బ తండా, వెంకటయ్య తండా, మాదారం సీతారామ ఆలయం కారేపల్లి ,బీసీ కాలనీ, మాణిక్యారం, గుడి తండా , గాదెపాడు, ఎర్రబోడు, ముత్యాల గూడెం, చీమలపాడు, గాంధీనగర్ తదితర గ్రామాలతో పాటు మండలంలోని మిగిలిన గ్రామపంచాయతీలలో వాడవాడల మండపాలు నిర్మించి ,గణేష్ విగ్రహాలను కొలువు తీర్చారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా మండపాలలోని గణేష్ విగ్రహాల వద్ద పలువురు దంపతులు పీటలపై కూర్చొని, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు . మండపాలలోని ఆ గణనాథున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ,ఆట పాటలతో సందడి చేస్తూ,ఈ 9 రోజులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. పలు గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహించి, ఆ గణనాథుడి ఆశీస్సులు పొందుతున్నారు. కుల,మతాలకు అతీతంగా ఆ గణనాధుని అందరూ పూజించడం విశేషంగా మారింది.
Also Read: Ganesh Navratri 2025: గణేశ్ ఉత్సవాలకు సర్వసిద్ధం.. ఊరు, వాడల్లో మొదలైన పండుగ కళ